iDreamPost

ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న పాకిస్థాన్.. అది చేసింది తామేనంటూ..!

  • Author singhj Published - 09:31 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 09:31 PM, Fri - 28 July 23
ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న పాకిస్థాన్.. అది చేసింది తామేనంటూ..!

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. దాయాదుల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య పలుమార్లు యుద్ధాలు జరిగినా.. పాక్ బుద్ధి మాత్రం మారలేదు. శాంతి ఒప్పందాలు చేసుకోవడం, తిరిగి సరిహద్దుల్లో కవ్వింపులకు దిగడం ఆ దేశానికి అలవాటుగా మారింది. అయితే పాక్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సరిహద్దులతో పాటు ఆ దేశం లోపల కూడా భారత సైన్యం వారిని చిత్తు చేసి ఎదురుదెబ్బలు కొడుతూనే ఉంది. అయినా తీరుమారని పాక్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది.

టెర్రరిస్టులను, ఆయుధాలను, చివరికి మత్తు పదార్థాలను కూడా బార్డర్ దాటించి భారత్​లోకి పంపుతోంది పాక్. ఈమధ్య కాలంలో ఎక్కువగా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్​ను పాక్ పంపడం.. సరిహద్దుల్లో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటి మీద కాల్పులు చేయడం గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. పొరుగు దేశం చైనా అండతో పాకిస్థాన్ చేస్తున్న ఈ దురాగతాలకు సంబంధించి భారత సైన్యం ఎన్నోసార్లు ఆధారాలతో సహా బయటపెట్టింది. అయినా తమకేమీ సంబంధం లేదని దాయాది దేశం కొట్టిపారేసింది. అయితే తాజాగా పాక్​ ప్రధానికి అత్యంత సన్నిహితుడే వీటిని ఒప్పుకున్నాడు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​కు రక్షణ సలహాదారుడిగా ఉన్న మాలిక్ మహ్మద్ అహ్మద్ ఖాన్ మీడియా ముందు ఈ విషయాన్ని అంగీకరించాడు. పాక్​లోని ప్రముఖ జియో న్యూస్​లో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడంపై మాలిక్ మహ్మద్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే స్మగ్లర్లు హెరాయిన్​ను సరఫరా చేసేందుకు డ్రోన్లను వాడతారని మాలిక్ చెప్పాడు. వరద బాధితులకు పునరావాసం కల్పించకపోతే వారు కూడా స్మగ్లర్లతో చేరే ఛాన్స్ ఉందని వెల్లడించాడు.

ఇండియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందా అని మాలిక్​ను ఆ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీని మీద స్పందించిన మాలిక్.. నియంత్రణ రేఖకు దగ్గర్లో ఉన్న కాసౌర్ రేంజర్స్ వద్ద డ్రోన్లతో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని ఒప్పుకున్నాడు. కాసౌర్ దగ్గర తాజాగా అలాంటి రెండు ఘటనలు జరిగాయని వివరించాడు. పది కిలోల హెరాయిన్​తో ఉన్న రెండు డ్రోన్లు.. బార్డర్ దాటి ఇండియాలోకి పంపినట్లు తెలిపాడు. దీనిపై పాక్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూ వీడియోను జర్నలిస్ట్ హమీద్ మీర్​ తన ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ అవడంతో పాక్ బుద్ధి మరోమారు బయటపడిందని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి