iDreamPost

Commonwealth Games: జావెలిన్ త్రోలో పాక్ అథ్లెట్ రికార్డు, గోల్డ్ కొట్టిన నదీమ్

Commonwealth Games: జావెలిన్ త్రోలో పాక్ అథ్లెట్ రికార్డు, గోల్డ్ కొట్టిన నదీమ్

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో 90.18 మీటర్లు నమోదు చేసి గోల్డ్ మెడల్ కొట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ లో 90 మీటర్లకు పైగా జావెలిన్ విసరడం ఇదే మొదటిసారి. ఈ ఫీట్ తో జావెలిన్ త్రోలో 90 మీటర్ల మార్కు దాటిన రెండో ఏషియన్ గా అర్షద్ నదీమ్ రికార్డులకెక్కాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు నమోదు చేసిన 22 మంది ఆటగాళ్ళలో నదీమ్ ఒకడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ విజేత, గ్రెనెడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ ని ఓడించి నదీమ్ ఈ అద్భుతం సాధించాడు. పీటర్స్ 88.64 మీటర్ల త్రో విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. నదీమ్ విజయంతో పాకిస్తాన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఖాతాలో అరవయ్యేళ్ళ తర్వాత స్వర్ణం చేరింది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రా ఫిట్ నెస్ సమస్యల వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి దూరంగా ఉండడం నదీమ్ కు కలిసొచ్చింది. నదీమ్ సాధించిన రికార్డు స్థాయి విజయంపై నీరజ్ చోప్రా అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడాలని ఆకాంక్షించాడు. టోక్యో ఒలింపిక్స్ లో చోప్రా 87.58 మీటర్ల త్రో నమోదు చేసి స్వర్ణం సాధించాడు. జూలైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరి రజత పతకం గెలుచుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి