iDreamPost

చంద్రబాబు అక్కడ కూడా చులకన అయిపోయారు

చంద్రబాబు అక్కడ కూడా చులకన అయిపోయారు

రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు కావడానికి పెద్ద సమయం పట్టదు. ఈ విషయం చంద్రబాబు అనుభవంలో సుస్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఆయన అందరికన్నా సీనియర్ పొలిటీషియన్ అంటూ చెప్పుకుంటారు. కానీ ఆయన మాటను చివరకు సొంత పార్టీ లో కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అక్కడ కూడా ఆయన చులకన అయిపోయారా అనే సందేహాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రజల్లో బలం ఉన్నంత కాలమే నాయకులు ఏమి చేసినా చెల్లుతుంది. అక్కడ పట్టుపోతే అందరూ ఎదురుతిరుగుతారు. అది ఎన్టీఆర్ అయినా..ఇప్పుడు చంద్రబాబు అయినా కూడా తప్పదు.

చంద్రబాబు పట్ల జనంలో ఆదరణ క్రమంగా తగ్గడమే తప్ప పెరగడం లేదు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా బాబు ధోరణి మారకపోవడంతో పుంజుకోవడం మాట అలా ఉంచి, ఉన్న పునాది కూడా కోల్పోయే పరిస్థితి దాపురిస్తోంది దాంతో చాలామంది నేతలు క్రమంగా చంద్రబాబు మీద విశ్వాసం కోల్పోతున్నారు. టీడీపీ శ్రేణులు కూడా జారుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు మాటను ఖాతరు చేయని పరిస్థితి దాపురిస్తోంది. అందరికన్నా బలమైన పునాది, పటిష్టమైన నిర్మాణం కలిగిన పార్టీ గా చెప్పుకునే టీడీపీ గతంలో ఏ పిలుపునిచ్చినా మారుమూల ప్రాంతాల్లో కూడా విజయవంతం అయ్యేది. కార్యకర్తలు అధికార, ప్రతిపక్షాల్లో ఎక్కడ ఉన్నా అధినేత మాటకు అంత గౌరవం దక్కేది.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారం కోల్పోయిన వెంటనే క్యాడర్ కూడా బాబుని పక్కన పెట్టడం ప్రారంభమయ్యింది. తొలుత చినబాబు మీద విశ్వాసం కోల్పోయిన శ్రేణుల్లో చివరకు ఇప్పుడది చంద్రబాబు వరకూ వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా కరెంటు బిల్లుల విషయంలో ప్రజల్లో అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని టీడీపీ చేసిన యత్నాలు బెడిసికొట్టడం దానికో ఉదాహరణ. బాబు పిలుపుని అమలు చేసే నాయకులే కనిపించలేదు.

అనేక మంది సీనియర్లు, కీలక నేతలు కూడా మొఖం చాటేశారు. పార్టీ పిలుపుని అమలు చేసేందుకు ఎవరూ సిద్ధపడినట్టుగా లేదు. చివరకు టీడీపీ కార్యాలయంలో కళా వెంకట్రావుతో కలిసి దీక్షకు పూనుకున్న వారిలో కేశినేని శ్వేత వంటి వారు మాత్రమే ఉన్నారంటే వారి పరిస్థితి అర్థమవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రధాన నేతలు కూడా ఎందుకు స్పందించలేదన్నది టీడీపీ నేతలను కలవరపెడుతోంది.

కేవలం కరెంటు సమస్యల మీదనే కాకుండా వరుసగా అనేక అంశాల మీద టీడీపీ కమిటీల తీరులో వస్తున్న మార్పులతో తలలు పట్టుకుంటున్నారు. గతానికి భిన్నంగా లీడర్లకు, క్యాడర్ కి మధ్య బంధం తెగిపోతుందా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది పార్టీకి పెను సమస్యగా పరిణమించే ప్రమాదం ఉందనే వాదన పెరుగుతోంది.

జగన్ మీద వ్యతిరేకత పెరిగిందంటూ సొంత మీడియా ద్వారా ఎంతగా ప్రచారం చేసినా జనంలో బాబుకి ఆదరణ మాత్రం పెరగడం లేదని ఈ పరిణామాలు చాటుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే బాబు మాటలకు కదలడం లేదంటే ఇక సాధారణ ప్రజల్లో స్పందన ఎలా ఆశించగలం అంటూ ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఎవరి దారి వారిదే అన్నట్టుగా చూసుకుంటున్న సమయంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టి, ఉన్న పునాదిని కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. టీడీపీ కి ఇది మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టే సంకేతంగానే చెప్పవచ్చు. నాయకుడి మీద విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సరైనా జాగ్రత్తలు పాటించకుండా ముందుకు సాగితే మనుగడకే ముప్పు వస్తుందనడంలో అనుమానం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి