iDreamPost

బంగారు బాతుని చంపేస్తున్న ఓటిటిలు

బంగారు బాతుని చంపేస్తున్న ఓటిటిలు

అదేదో కథలో చెప్పినట్టు రోజుకో బంగారు గుడ్డుని పెట్టే బాతుని ఒకేసారి పొట్టలో ఎన్నున్నాయో చూడాలని దాన్ని చంపేశాడట వెనకటికి ఒకడు. అలా ఉంది ఓటిటిల వ్యవహారం. ఏడాదికోసారి చందా కట్టి అందులో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూసుకోవచ్చని నిక్షేపంగా ఉన్న ప్రేక్షకులను కొత్తగా పే పర్ వ్యూ మోడల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మాత్రం దానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ లాంటివి ఎందుకు పెడుతున్నారని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. కెజిఎఫ్ 2(KGF2), ఆర్ఆర్ఆర్ ల(RRR)కు థియేటర్ టికెట్లకు అదనంగా బాదించుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి దోపిడీకి తెగబడటం ఏమిటనేది వాళ్ళ ఆవేదన.

నిజానికిది విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అక్కడ విజయవంతమయ్యింది కూడా. కానీ అక్కడి ఆర్థిక పరిస్థితులకు మన ఆదాయ వ్యయాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ సగటు మధ్యతరగతి ఉద్యోగితో మొదలుపెట్టి కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్ మెన్ దాకా ఎవరూ డబ్బంటే లెక్క లేకుండా ప్రవర్తించరు. ముఖ్యంగా టీవీ సినిమా లాంటి విషయాల్లో. అందుకే ఎన్ని వస్తువుల ధరలు పెరిగినా ఇండియాలో మాత్రం స్మార్ట్ టెలివిజన్లు ఫోన్లు అందుబాటు ధరల్లో దొరుకుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్ ట్రా బాదుళ్లను వాళ్ళు ఎంత మాత్రం సహించరు. అందుకే ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని ఓటిటిలు గుర్తించాలి.

కరోనా తర్వాత ఓటిటి యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన మాట వాస్తవం. అలా అని రేట్లు పెంచుకుంటూ పోవడం చెల్లదు. గ్యాస్ పెట్రోల్ లాగా మన దేశంలో వినోదం చచ్చినట్టు కొనే వస్తువు కాదు. విచ్చలవిడిగా పైరసీ దొరుకుతున్న టెక్నాలజీలో జనం అవి ఎక్కడ దొరుకుతాయో అవగాహనా పెంచుకున్నారు . రోజువారీ ఆదాయం మీద ఆధారపడి ఆటో డ్రైవర్లకు సైతం దొంగదారిలో సినిమాలు దొరికే మార్గాలు తెలుస్తున్నాయి. అలాంటప్పుడు మరింత చేరువయ్యేలా డిజిటిల్ సంస్థలు చూసుకోవాలి. రెండు రోజుల్లో చూసే తీరాలన్న నిబంధనతో(AMAZON PRIME RENTAL) 199 రూపాయలు కట్టమంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే బంగారుబాతుని చంపకూడదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి