iDreamPost

ఎవరు చెప్పినా మాకు అనవసరం.. జగన్‌ చెప్తే మాత్రం విమర్శిస్తాం..

ఎవరు చెప్పినా మాకు అనవసరం.. జగన్‌ చెప్తే మాత్రం విమర్శిస్తాం..

‘‘పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరీక్విన్‌ మందులు వాడడం వల్ల కోలుకునే వారి శాతం ఎక్కువగా ఉంది. వైరస్‌ నిర్మూలనకు శానిటేషన్‌లో బ్లీచింగ్‌ ఉపయోగించడం ఎంతో ఉపయోగకరం. దాదాపు 80 శాతం మంది ఆస్పత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే వ్యాధి నిర్మూలన అవుతుంది. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా.. మరణాల రేటు తక్కువ. వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుక్కోవడానికి ఇంకో ఏడాది కూడా పట్టొచ్చు. లేదా ఎయిడ్స్‌కు మందు లేనట్లే కరోనాకూ మందు తయారు చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కరోనాతో కలసి జీవించాల్సిందే. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా కరోనా సోకిన వారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో అందుబాటులో ఉన్న వైద్యం అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చు.’’ ఈ మాటలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ మేథావులు, పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు చెబుతున్నవే.

కానీ ఇవే మాటలు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబితే మాత్రం.. ఇక్కడి ప్రతిపక్షాలకు, వాటికి కొమ్ముకాసే ఓ వర్గం మీడియాకు నచ్చదు. సోషల్‌మీడియాలో పెయిడ్‌ వర్కర్లతో అదే పనిగా జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తారు. అసభ్య పదజాలంతో దూషిస్తారు. కరోనా విపత్తు సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహాయకంగా ఉండి, మంచి సలహాలతో ముందుకు సాగుతున్నాయి. కానీ ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం విద్వేష రాజకీయాలు చేస్తున్నాయి. ఒకరేమో కరోనా వ్యాప్తికి జగన్‌ కారణమంటారు.. మరొకరేమో వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాప్తి చేస్తున్నారంటారు. ఇంకొకరేమో జగన్‌కు కరోనాను ఆపడం చేత కావడం లేదంటారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక, వైద్య పరిపుష్టి కలిగిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలతోపాటు, మన దేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా వైరస్‌ విజృంభిస్తోంది. మరి ఇక్కడ వ్యాప్తికి ఆయా దేశాల ప్రధానులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కారణమవుతారా? ఆపడం వారికి చేత కావడం లేదా? అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఏపీలో సీఎంగా జగన్‌ ఎన్నికైన దగ్గరనుంచి ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుర్మార్గ రాజకీయాలు ఇవి.

మన రాష్ట్రంలో కరోనా రాకముందు ఉన్న ల్యాబ్‌లు 3, వాటి సామర్థ్యం రోజులకు 200 పరీక్షలు. కానీ నెల రోజుల తర్వాత ఇప్పుడు రోజుకు 15,000 టెస్టులు చేసే సామర్థాన్ని పొందాం. మొన్నటి దాకా ఏపీలో టెస్టులు చేయడం లేదు కాబట్టే కరోనా కేసులు పెరగడం లేదన్న విపక్షాలు నేడు విమర్శలలో మరో అంకానికి తెరతీశాయి. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అధికార పక్షం విఫలమైందని ఆరోపణలు చేస్తున్నాయి. కరోనా వల్ల లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ప్రజలకు ఖర్చుల కోసం ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వెయ్యి రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ విపక్షాలు మాత్రం 5 వేలు ఇవ్వాలంటాయి. కరోనా చికిత్స తీసుకొని ఇంటికి వెళుతున్న వారికి రవాణా ఖర్చులకు ఓ 2 వేలు ఇస్తే, కాదు 10వేలు ఇవ్వాలంటారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రాలకు ఆదాయం లేదు. ఈ విషయం విపక్షాలకూ తెలుసు. కానీ ప్రభుత్వాన్ని కేవలం విమర్శించాలి, దూషించాలి అన్న లక్ష్యంతో అసందర్భ కోరికలు కోరుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి