iDreamPost

రాష్ట్ర ప్రజలు కోరేది ఒక రాజధాని అని నిరూపించే మహదవకాశం…

రాష్ట్ర ప్రజలు కోరేది ఒక రాజధాని అని నిరూపించే మహదవకాశం…

రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశాక అమరావతి ప్రాంతంలో రైతులు కొందరు నిరసన దీక్షలు మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొందరు హర్షం వ్యక్తం చేశారు. అంతకు మించి ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. రాజధాని నగరం ఒక చోట ఉన్నా, మూడు చోట్ల ఉన్నా సగటు పౌరుడి జీవితంలో పెద్ద తేడా కనిపించదు కాబట్టి ఆ నిర్లిప్తత.

అయితే తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం కొన్ని రోజులు సాగించారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉంటే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, మూడు రాజధానులతో అధోగతే అని ఉపన్యాసాలు ఇచ్చారు. అమరావతికి మద్దతు కూడగట్టడానికి అక్కడక్కడా పర్యటించి పోరాటం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి అమరావతిలో కూడా మద్ధతు పలికే జనం సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇంతలో ప్రజా చైతన్య యాత్ర అని బస్సు యాత్ర మొదలుపెడితే దానికి కూడా స్పందన అంతంత మాత్రమే కనిపించింది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.

అయితే చంద్రబాబు కానీ, ఆయన చుట్టూ ఉన్న నాయకులు కానీ అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలి అని వాదిస్తూ, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేది అదే అని బలంగా నమ్ముతూ ఇతరులని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అమరావతిలో ఒక్క చోటే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని తిరుగులేకుండా నిరూపించి, మూడు రాజధానులకు మద్దతు పలికేవారి నోళ్ళు మరి లేవకుండా మూయించే సువర్ణ అవకాశం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది.

ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో అన్ని చోట్లా పోటీచేసి అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలన్న సింగిల్ పాయింట్ మానిఫెస్టోతో, అన్ని ప్రాంతాల్లో ఆ ఒక్క అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, అధికార పక్షంకన్నా ఎక్కువ స్థానాలు గెలిచినా, లేదా కొంచెం అటూఇటూగా సమానంగా స్థానాల్లో గెలిచినా అధికార పక్షాన్ని గట్టి దెబ్బ తీయడమే కాకుండా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రెట్టించిన ఉత్సాహంతో, మరింత తీవ్రంగా పోరాటం చేయవచ్చు. అప్పుడు జగన్ కూడా రాజధాని వికేంద్రీకరణ మీద పునరాలోచన చేయక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి