iDreamPost

Covishield: కోవిషీల్డ్‌ తీసుకున్నాకే మా బిడ్డ మృతి చెందింది! సుప్రీం కోర్టులో అమ్మ పోరాటం!

  • Published May 03, 2024 | 1:49 PMUpdated May 03, 2024 | 1:49 PM

బ్రిటీష్‌ ఫార్మ కంపెనీ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వల్ల సైడ్‌ ఎఫెక్స్‌ ఉన్నాయంటూ కంపెనీ వెల్లడించిన తర్వాత దానిపై న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తన బిడ్డ మృతికి కోవిషీల్డే కారణమంటూ ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఓ తల్లి. ఆ వివరాలు.

బ్రిటీష్‌ ఫార్మ కంపెనీ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వల్ల సైడ్‌ ఎఫెక్స్‌ ఉన్నాయంటూ కంపెనీ వెల్లడించిన తర్వాత దానిపై న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తన బిడ్డ మృతికి కోవిషీల్డే కారణమంటూ ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఓ తల్లి. ఆ వివరాలు.

  • Published May 03, 2024 | 1:49 PMUpdated May 03, 2024 | 1:49 PM
Covishield: కోవిషీల్డ్‌ తీసుకున్నాకే మా బిడ్డ మృతి చెందింది! సుప్రీం కోర్టులో అమ్మ పోరాటం!

కరోనా మహామ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కోవిడ్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇంకా కోలుకోలేదు. ఇక మహామ్మారి కట్టడి కోసం దేశాలన్ని టీకాను కనిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో బ్రిటీష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా కోవిడ్‌ కట్టడి కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మన దేశంలో కోవిషీల్డ్‌ పేరుతో ప్రజలకు దీన్ని వేశారు. అయితే మహమ్మారికి వెంటనే చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో.. ఓ టీకా అభివృద్ధి, ఆమోదానికి నిర్వహించాల్సిన ప్రాథమిక పరీక్షలేవి లేకుండానే.. కోవిషీల్డ్‌ను అనుమతించారు. మన దేశంలో కోట్ల మందికి ఈ టీకాను వేశారు. అయితే హడావుడిగా టీకాను అభివృద్ధి చేయడం.. సరైన పరీక్షలు లేకుండానే వినియోగానికి అనుమతివ్వడంపై ప్రారంభంలోనే అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రభుత్వాలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక తాజాగా ఆస్ట్రాజెనికా చేసిన ఓ ప్ర‍కటన ప్రపంచ దేశాలను.. మరీ ముఖ్యంగా భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

తాము అభివృద్ధి చేసిన టీకా వల్ల కొన్ని అరుదైన దుష్ప్రభావాలు ఉన్నట్లు.. దీని వల్ల రక్తం గడ్డకట్టడమే కాక.. ప్లేట్‌లేట్‌ సంఖ్య కూడా తగ్గిపోతుందని ఆస్ట్రాజెనికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో గత కొన్నాళ్లుగా మన దేశంలో అకస్మాత్తుగా పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కారణం ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్‌ ప్రభావమే అంటున్నారు బాధితులు. దాంతో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపడమేకాక.. ఆస్ట్రాజెనికాపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్‌ పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ యువతి తల్లిదండ్రులు ఆస్ట్రాజెనికాపై పోరాటానికి రెడీ అవుతున్నారు. తమ కుమార్తె మరణానికి కోవీషీల్డే కారణమని ఆరోపిస్తూ.. ఆస్ట్రాజెనికాపై దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించడంతో.. బాధితులకు మద్దతు తెలిపే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకాను.. ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇక వ్యవహారంపై సీఐఐ ఇంతవరకు స్పందించలేదు.

ఇక ఆస్ట్రాజెనికా మీద దావా వేస్తోన్న వ్యక్తి పేరు వేణుగోపాలన్‌ గోవిందన్‌. వీరి కుమార్తె కారుణ్య(20) 2021లో మృతి చెందింది. అయితే కోవిషీల్డ్‌ టీకా వేసుకోవడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కారుణ్య తల్లిదండ్రులు గతంలోనే ఆరోపించారు. ఇక తాజాగా ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని అంగీకరించడంతో.. కారుణ్య తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. రచనా గంగూ అనే మహిళ కూడా 2021లో తన 18 ఏళ్ల కుమార్తె రిథైకాను కోల్పోయింది.

ఆస్ట్రాజెనికా ప్రకటన తర్వాత.. ఈ బాధితులిద్దరి తల్లిదండ్రులు.. సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వారి కుమార్తెల మరణాలపై విచారణ చేయడం కోసం మెడికల్‌ బోర్డును నియమించాలని కోరారు. చనిపోయాక నష్టపరిహారం ఇచ్చే బదులు.. వ్యాక్సినేషన్‌ ప్రభావాలను ముందుగానే గుర్తించేలా ఓ ప్రొటోకాల్‌ను తయారు చేసే విధంగా.. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఇక గోవిందన్‌ ట్విట్టర్‌ వేదికగా సీరం ఇన్‌స్టిట్యూట్‌, దాని హెడ్‌ అదర్‌ పూణావాలాకు ప్రశ్నలు సంధించాడు. సీరం ఇన్‌స్టిట్యూట్‌, అదర్‌ పుణావాలాలు.. వారి పాపాలకు.. చనిపోయిన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. అంతేకాక ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించిన ప్రభుత్వ సంస్థలను కూడా నిందితులే అని పేర్కొన్నాడు.

ఇక వ్యాక్సిన్‌ ప్రభావాల గురించి ప్రకటన వెలువడిన తర్వాత ఆస్ట్రాజెనికా కంపెనీపై ఒక్క యూకేలోనే ఇప్పటికే అనేక దావాలు నమోదయ్యాయి. ఆస్ట్రాజెనికా టీకా వల్ల సుమారు 51 మంది బాధపడ్డారని.. వీరిలో కొందరు చనిపోగా.. మరి కొందరిలో తీవ్రమైన గాయాలు అయ్యాయని ఆరోపించారు. అయితే ఆస్ట్రాజెనికాపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. యూకే ప్రభుత్వం మాత్రం సదరు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన చేయకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి