iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలపై పీఠముడి.. నిర్ణీత సమయంలో వీడుతుందా..?

స్థానిక సంస్థల ఎన్నికలపై పీఠముడి.. నిర్ణీత సమయంలో వీడుతుందా..?

స్థానిక సంస్థల ఎన్నికలపై పడిన పీఠముడి ఇంకా వీడలేదు. నిబంధనలకు విరుద్ధంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొననసాగుతూనే ఉంది. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచారణ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలి. కానీ జరుగుతున్న పరిణామాలు విచారణ నిర్ణీత సమయంలోపు పూర్తి అయ్యే సూచనలు కనిపించడంలేదు.

విచారణలో భాగంగా గురువారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనాభా సర్వే చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఖరారు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ప్రభత్వుం తన వాదనలను కూడా సమర్థంగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం వెరసి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఇందులో బీసీ రిజర్వేషన్లపైనే ప్రస్తుతం చిక్కుముడి నెలకొంది. బీసీ జనాభా శాతానికి తక్కువగానే రిజర్వేషన్లు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంటోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొంటోంది. అయితే పిటిషన దారుడు, టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం రాష్ట్ర విభజన తర్వాత జనాభా సర్వే చేయకుండా ఎలా నిర్థారిస్తారని వాదిస్తున్నారు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ఈ ఆర్థిక ఏడాది ముగిసే (మార్చి 3) లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. దాదాపు మూడు వేల కోట్లు గ్రామ పంచాయతీలు నష్టపోతాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవిస్తున్నారు. చంద్రబాబు తీరు వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని పరిశీలకులు చెబుతున్నారు. 2018 ఆగస్టులో పంచాయతీ పాలక మండళ్ల గడువు ముగిసినా.. అప్పటి నుంచి సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉన్నా ఎన్నికలు నిర్వహించలేదు. గత ఏడాది సాధార ణ ఎన్నికల సమయానికే మండల, జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేసింది.

రిజర్వేషన్లు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఆర్‌వోల నియామకం.. తదితర అన్ని పనులను ప్రభుత్వం చక్కబెట్టింది. సంకాంత్రి మరుసటి రోజు అంటే జనవరి 17వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుండగా.. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేయడంతో.. నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అయితే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రిం నెల రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. ఈ గడువు మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రిజర్వేషన్ల చిక్కుముడి వీడుతుందా..? లేదా..? అన్న ఉత్కంఠ నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి