iDreamPost

‘మంచు’ కురిపించిన ‘పల్లకి’ – Nostalgia

‘మంచు’ కురిపించిన ‘పల్లకి’ – Nostalgia

దర్శకుడు వంశీ విలక్షణ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోదావరి అందాలను, చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని, మధురమైన సంగీతాన్ని ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఇవ్వడం ఆయనకే చెల్లింది. వంశీ మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేశారు. అదే మంచు పల్లకి. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క మూవీ ఇది. తర్వాత ఎందుకనో కలవలేకపోయారు. తమిళ్ లో 1981లో వచ్చిన ‘పలైవాన సొలై’ని రీమేక్ గా వంశీ మంచు పల్లకిని రీమేక్ చేశారు. మెయిన్ హీరోయిన్ సుహాసిని ఒరిజినల్ తో పాటు తెలుగులోనూ అదే పాత్ర చేశారు.

అక్కడ చంద్రశేఖర్ చేసిన రోల్ ఇక్కడ చిరంజీవి తీసుకున్నారు. పైన వర్కింగ్ స్టిల్ ఈ సినిమాకు సంబంధించినదే. రాజన్ నాగేంద్ర సంగీతం కూడా బాగా ప్లస్సయ్యింది. దీని తర్వాత వంశీ పూర్తిగా ఇళయరాజాకు షిఫ్ట్ అయిపోయి పదేళ్లకు పైగా ఆయనతో అనుబంధాన్ని కొనసాగించారు. ఇదంతా ఎలా ఉన్నా మంచు పల్లకి వంశీకి ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఉద్యోగాలు లేక ఖాళీగా సరదాగా తిరిగే ఐదుగురు యువకులు ఉండే కాలనీకి వస్తుంది హీరోయిన్. చలాకీగా, అందంగా ఉన్న తనను చూసి శేఖర్ ఇష్టపడతాడు. కానీ బయటపడడు. వీళ్ళందరికీ ఆ అమ్మాయి మంచి స్నేహితురాలిగా మారిపోతుంది.

తర్వాత వీళ్ళ జీవితాన్ని సరిదిద్దే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్న ఆమెకు ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉందని ఆ అయిదుగురికి తర్వాత తెలుస్తుంది. అందరికి దారి చూపి తాను మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుంది. చిరంజీవితో మిగిలిన ఫ్రెండ్స్ గా రాజేంద్ర ప్రసాద్, సాయి చంద్, నారాయణరావు, గిరీష్ కనిపిస్తారు. ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే చివరికి వచ్చేసరికి ఎమోషనల్ గా హృదయాలను బరువెక్కించే మంచు పల్లకి పెరఫార్మన్స్ పరంగా చిరు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.డెబ్యూ మూవీగా రీమేక్ ని ఎంచుకున్నప్పటికీ వంశీ నిర్ణయం సరైనదేనని ఫలితం ఋజువు చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి