iDreamPost

ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య కాసేపట్లో చర్చలు.. పంచాయతీ ఎన్నికలపై ఏం తేల్చబోతున్నారు..?

ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య  కాసేపట్లో చర్చలు.. పంచాయతీ ఎన్నికలపై ఏం తేల్చబోతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు ఇరు వర్గాలు ఈ అంశంపై చర్చించబోతున్నాయి. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు అధికారులు బృందం భేటీ కాబోతోంది. ముగ్గురు అధికారుల బృందంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యానాథ్, జి.కె.ద్వివేది, ఎ.కె.సింఘాల్‌లు ఉన్నారు.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ సన్నద్ధత నేపత్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై హైకోర్టుకు చేరింది. ఇరు వర్గాలు మాట్లాడుకుని ఈ అంశంపై ఓ నిర్ణయానికి రావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మార్చి నెలాఖరున పదవీ విరమణ చేబోతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నిలకను నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. రాజకీయ పార్టీలకు, నేతలకు లేని ఆతృత నిమ్మగడ్డలో కనిపించడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. అయితే కరోనాను కారణంగా చూపుతూ నిమ్మగడ్డ వాయిదా వేసిన ఎన్నికలను.. తిరిగి ఆయనే కరోనా వ్యాప్తి సమయంలోనూ నిర్వహించాలనుకుంటుండం విశేషం.

నిమ్మగడ్డ నిర్ణయంపై ఏ మాత్రం సుముఖంగా లేని రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాల దృష్ట్యా కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత, లేదా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వేసవిలో ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పటికి కరోనా కట్టడిలోకి రావడంతోపాటు.. కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వెలుసుబాటు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అధికారులు కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై సుముఖంగా లేరు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ఫలితం ఎలా ఉంటుంది..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ సమావేశం తర్వాతైనా.. ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలకు ఫుల్‌స్టాఫ్‌ పడుతుందా,.? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి