iDreamPost

జగన్ జీ.. మీ సహాయానికి ధన్యవాదాలు

జగన్ జీ.. మీ సహాయానికి ధన్యవాదాలు

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు, కార్మికులను వారి వారి స్వగ్రామాలకు పంపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారిని నియమించారు. సహాయం కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల వలస జీవులను వారి వారి స్వగ్రామాలకు తరలించారు.

ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. తమ రాష్ట్ర కూలీలు, కార్మికులు తరలించేందుకు తీసుకున్న చర్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ముఖ్యమంత్రులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాల్లోని వలస కార్మికులు చిక్కుకుపోయిన వారిని తరలించడం పై వీరు చర్చించారు.

ఏపీ నుంచి ఒడిశా కు, అలాగే ఒడిశా నుంచి ఏపీ కి కూలీలను పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారు.

కాగా, స్వరాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలు వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఏపీ సర్కార్ 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ కి ఫోన్ చేసి తాము ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్లాల్సింది, ఫోన్ నెంబర్ చెప్తే చాలు.. ప్రభుత్వమే వారి వారి ప్రాంతాలకు తరలిస్తుంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ప్రజలు 0866 2424680 అనే నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు చెబితే వారిని తీసుకు వచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఏపీ సర్కార్ చర్చించి అవసరమైన చర్యలు చేపడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి