iDreamPost

“బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 200 పైగా సీట్లు మావే”- నితీష్ ధీమా

“బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 200 పైగా సీట్లు మావే”- నితీష్ ధీమా

బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ మాసంలో ఎన్నికలు జరగనుండడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ఎన్నికల వేడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తుల అంశంపై ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి.ఈరోజు పాట్నాలో జరిగిన జేడీయు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయేలో జేడీయు భాగస్వామిగా ఉంటుందని స్పష్టంచేశారు. అంతేకాకుండా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 243 స్థానాలలో ఎన్డీయే కూటమి 200లకు పైగా సీట్లలో గెలుస్తుందని ముఖ్యమంత్రి నితీశ్ ధీమా వ్యక్తంచేశారు.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-2010 ఫార్మెట్‌లోనే బీహార్‌లో ఎన్‌పీఆర్ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ అంశంపై ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో బీహార్ సాధించిన పురోగతి తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని, అయితే దీనితో సంతృప్తి పడకుండా దేశంలోని ఐదు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా బీహార్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

దేశంలో మహిళలపై నేరాలు పెచ్చుమీరడానికి పోర్న్ వెబ్‌సైట్లే కారణమని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పునరుద్ఘాటించారు.పోర్న్ వెబ్‌సైట్స్‌లను నిషేధించాలని దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పోర్న్ సైట్స్‌లను బ్యాన్ చేయాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రములోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార ఎన్డీయేలో భాగస్వాములైన జనతాదళ్ యునైటెడ్-బిజెపి పార్టీలు ఒక కూటమిగా, ప్రతిపక్ష యూపీఏ భాగస్వామ్యలైన రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్ పార్టీలు మరో కూటమిగా అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరి తలపడనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి