iDreamPost

ఈ వాహనాలకు మరో పది శాతం పొల్యూషన్ ట్యాక్స్..

ఈ వాహనాలకు మరో పది శాతం పొల్యూషన్ ట్యాక్స్..

ఈ మధ్య సొంత వెహికిల్ కొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రజారవాణా మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోతోంది.ఈ క్రమంలో సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మీరు త్వరలో ఆ వాహనాలను కొనాలనుకుంటున్నారా? అయితే కొత్తగా వాహనాలను కొనాలనుకునే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆ వాహనాలపై ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా జీఎస్టీ విధించనున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ఆ వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇంతకీ ఏ వాహనాల ధరలు పెరగనున్నాయి? దానికి గల కారణాలు ఏంటీ? పూర్తి వివరాలు మీ కోసం..

డీజిల్ వాహనాలను కొనాలనుకునే వారికి, అదే సమయంలో వాటిని తయారు చేస్తున్న ఆటోమోబైల్ కంపెనీలకు ప్రభుత్వం షాకిచ్చింది. డీజిల్ వాహనాలపై ఇప్పుడున్న దానికి అదనంగా 10 శాతం GST విధించేందుకు ప్రతిపాదించనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ 10 శాతం అదనపు జీఎస్‌టీని పొల్యూషన్ టాక్స్‌గా తెలిపారు. దీని ప్రధాన లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడమేనని సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోమొబైల్ కంపెనీలు .. డీజిల్ వాహనాల్ని తగ్గించాలని నేను కోరుతున్నానని, డీజిల్ వాహన ఉత్పత్తి తగ్గించకుంటేపన్ను విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇప్పటికే దేశంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాల తయారీల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ఆటో మొబైల్ కంపెనీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్న డీజిల్ వాహనాలను అరికట్టేందుకు జీఎస్టీ పెంచనున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ చర్యతో డీజిల్ వాహన విక్రయాలు తగ్గుతాయని తెలిపారు. పర్యావరణానికి హాని చేయని వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆటోమొబైల్ సంస్థలను గడ్కరీ కోరారు.ఇక నితిన్ గడ్కరీ చేసిన ఈ ప్రకటనతో ఆటో మొబైల్ కంపెనీలు ఉలికిపడ్డాయి. ప్రముఖ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి