iDreamPost

సమర్ధన కోసం కౌంటర్లో ఇన్ని అడ్డుగోలు వాదనలా ?

సమర్ధన కోసం కౌంటర్లో  ఇన్ని అడ్డుగోలు వాదనలా ?

హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన రిప్లై కౌంటర్లో అడ్డుగోలు సమర్ధింపులే కనబడుతున్నాయి. ఎన్నికల వాయిదా విషయంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికే నిమ్మగడ్డ అవస్తలు పడుతున్న విషయం తెలిసిపోతోంది. కోర్టుకు సమర్పించిన రిప్లైలో ఎన్నికల వాయిదా నిర్ణయం పూర్తిగా రహస్యమని, ఎవరితోను చర్చించాల్సిన అవసరం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు ఐఏఎస్ అధికారిగా చేసిన నిమ్మగడ్డకు ఎన్నికలంటే ప్రజలకు, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన విషయమని తెలీకపోవటమే విచిత్రంగా ఉంది. అలాగే ఏకగ్రీవాలపైన కూడా అడ్డుగోలు వాదన వినిపించాడు.

ఇంతకీ విషయాలు ఏమిటంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో జరిగిన హింస గురించి ప్రస్తావించాడు. హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ లెక్కలకు ప్రతిపక్షాల ఫిర్యాదులకు, మీడియాలోని కథనాలకు చాలా వ్యత్యాసం ఉందని ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పే లెక్కలు, ప్రతిపక్షాల ఆరోపణలు ఒకేలాగుంటాయా ? ఇక మీడియాలో వచ్చే కథనాలకు ఆధారాలేమిటి ? ప్రభుత్వం చెప్పే లెక్కలకు, ప్రతిపక్షాల ఆరోపణలకు, మీడియాలో కథనాలకు పొంతనుండదన్న చిన్న విషయం కూడా నిమ్మగడ్డకు తెలీదా ?

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదని చెప్పటానికి ఏకగ్రీవమైన ఎంపిటిసి, జడ్పిటిసి స్ధానలే నిదర్శనంగా చెప్పటం మరో వింతగా ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో 2 శాతం ఎంపిటిసి స్ధానాలు ఏకగ్రీవమైతే ఇపుడు 24 శాతం ఎలా ఏకగ్రీవమవుతాయని నిమ్మగడ్డ ప్రశ్నించాడు. అలాగే పోయిన ఎన్నికల్లో ఒక్క జడ్పిటిసీ సీటు ఏకగ్రీవమైతే ఇపుడు మాత్రం 126 జడ్పిటిసి సీట్లు ఏకగ్రీవమయ్యాయట.

ఇక్కడ నిమ్మగడ్డ మరచిపోయిన విషయం ఏమిటంటే 2014లో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగినపుడు వైసిపి, టిడిపి రెండు ప్రతిపక్షంలోనే ఉన్నాయి. కాబట్టి అప్పట్లో పోటా పోటీగా రెండు పార్టీలు గెలుపు కోసం పోటి పడ్డాయి కాబట్టే ఎక్కువ స్ధానాల్లో ఏకగ్రీవం సాధ్యమవ్వలేదు. కానీ ఇప్పటి పరిస్ధితికి పోయిన ఎన్నికలకు సంబంధమే లేదు. ఎందుకంటే పదిమాసాల క్రితమే వైసిపి బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చింది. 151 ఎంఎల్ఏల గెలుపు దామాషాతో పోల్చినపుడు ఇపుడు వైసిపి ఖాతాలో పడిన ఏకగ్రీవాల్లో పెద్ద ఆశ్చర్యం లేదు.

అధికారంలోకి వచ్చిన వెంటనే తానిచ్చిన హామీల అమలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ హామీల అమలుకు రెడీ అవుతాడని ప్రతిపక్షాలేవీ ఊహించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికిన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు జనాల్లో సానుకూలత పెరిగింది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి టిడిపి చంద్రబాబు అండ్ కో ఎవరూ కోలుకోలేదు. అందుకనే వెంటనే వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయటానికి తమ్ముళ్ళెవరూ సిద్ధంగా లేరన్నది వాస్తవం. టిడిపి నేతలు పోటికి ముందుకు రాకపోవటం కూడా ఏకగ్రీవాల్లో వైసిపికి అనుకూలంగా రావటానికి కారణమైంది.

ఇక తన విచక్షణ ప్రకారమే ఎన్నికలను వాయిదా వేయాలని నిమ్మగడ్డ అనుకుంటే ముందుగా అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ, డిజిపి, హెల్త్ ప్రిన్పిపుల్ సెక్రటరీతో సమావేశం జరిపుండాలి. ఆ తర్వాత తన విచక్షణను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేశానని చెప్పుకున్నా అర్ధముండేది. అదే రిప్లైలో ఎన్నికల వాయిదా నిర్ణయం పూర్తిగా రహస్యమంటున్నాడు. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఎన్నికల కమీషన్ కార్యదర్శితో కూడా చర్చించాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ చెప్పటం వినటానికే విచిత్రంగా ఉంది. ప్రజలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ/ వాయిదా రహస్యం ఎలాగవుతుందో నిమ్మగడ్డే చెప్పాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల వాయిదా విషయాన్ని ప్రభుత్వంతోనో లేకపోతే కార్యదర్శితో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదంటూనే మరోవైపు కేంద్రంతో చర్చించానని చెప్పటం గమనార్హం. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఎన్నికల గురించి కేంద్రంతో మాట్లాడటంలో అర్ధమేంటి ? రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శితోనే కమీషనర్ మాట్లాడాలి. ఇప్పటి ప్రత్యేక పరిస్ధితుల్లో మెడికల్ అండ్ హెల్త్ ముఖ్య కార్యదర్శితో కూడా మాట్లాడాల్సిందే.

రిప్లై కౌంటర్లో మరో అడ్డుగోలు వాదన కూడా వినిపించాడు. ఎన్నికల షెడ్యూల్ మార్పుల విషయం తనతో ప్రభుత్వం చర్చించలేదట. నిజానికి ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు, చేర్పుల విషయంలో ఎన్నికల కమీషనర్ తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ లో మార్పులన్నది పంచాయితీరాజ్ చట్టంలో సవరణల ద్వారా తెచ్చింది ప్రభుత్వం. అసెంబ్లీలో బిల్లుపెట్టి, చట్టం చేసినపుడు ఎన్నికల కమీషన్ తో మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేయటం వరకే ఎన్నికల కమీషనర్ బాధ్యత. మొత్తం మీద చేసిన తప్పును సమర్ధించుకోవటానికి మాత్రమే అడ్డుగోలు వాదన వినిపిస్తున్నట్లు అర్ధమైపోతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి