అధికార పార్టీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గ్రామ స్థాయి నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా..? 9 ఏళ్లపాటు పార్టీ కోసం, ఎన్నికల్లో గెలుపుకోసం శాయశక్తులా పని చేసి ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదన్న భావనలో ఉన్నారా..? అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు.. అవుననే సమాధానికి బలం చేకూరుస్తున్నాయి.
వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్, రాష్ట్ర స్థాయిలో గుర్తింపుఉన్న నగరి ఎమ్మెల్యే రోజాకు తాజాగా సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి ఎదురవడం తీవ్ర చర్చనియాంశమైంది. పుత్తూరు మండలం, కేబీఆర్ పురం గ్రామ సచివాలయం శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే కారును అడ్డుకోవడంతో ఆమె అక్కడ నుంచి వెనుతిరిగారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది.
ఎందుకిలా..?
2014 ఎన్నికల్లో విజయానికి సమీపంలోకి వచ్చి ఆగిపోవడంతో 2019 ఎన్నికల్లో తప్పక గెలవాలన్న కసితో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఐదేళ్లు పని చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమపై కేసులు బనాయించినా ఎదుర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయినా భరించి పార్టీని కాపాడుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఇవ్వకపోయినా సహించారు. 2019 ఎన్నికలు చావో.. రేవో అన్నట్లుగా భావించి సర్వశక్తులు ఒడ్డారు. ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నారు. ఒక్క ఓటు ముఖ్యమేనన్న లక్ష్యంతో పని చేశారు. ఎన్నికలకు ముందు తర్వాత గడపగడపకు వైఎస్సార్, ఇంటింటికి నవరత్నాలు కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం.. ఇలా కో ఆర్డినేటర్ స్థానంలో వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యేలకు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేశారు.
గెలిచాక.. ముఖం చాటేశారు..
అయితే ఎన్నికల తర్వాత దాదాపు 95 శాతం ఎమ్మెల్యేలు గ్రామాలకు రావడం మానేశారు. గ్రామ స్థాయి నేతలకు ముఖం చాటేశారు. నియోజకవర్గ కేంద్రలోని తన కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామానికి వచ్చిన నేతలు గెలిచిన తర్వాత కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా ఆయా గ్రామాలకు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. మరో వైపు పార్టీ కార్యాలయాలకు వద్దకు వెళ్లిన గ్రామ స్థాయి నేతలకు ఎమ్మెల్యేలను కలిసి, తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రావడంలేదు. ఎమ్మెల్యేల చుట్టూ ఓ కోటరి తయారయింది. ఈ కోటరీని దాటి వెళ్లినా తమ గ్రామ సమస్యలు చెప్పుకునే సమయం ఎమ్మెల్యేలు ఇవ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు హామీలు ఇచ్చిన గ్రామ స్థాయి నేతలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
కష్టపడిన వారికి అన్యాయం..
గెలిచే వరకు పేరు పెట్టి పిలిచిన కార్యకర్తలను ఇప్పుడు వారు ఎదురుగా వెళ్లి నిలబడినా గుర్తులేనట్లుగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. 9 ఏళ్లు పార్టీ కోసం కష్ట పడ్డవారిని కాదని, ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది వైఎస్సార్సీపీలో ఆది నుంచి ఉన్న వారికి తీవ్రమైన ఆవేదనను కలిగిస్తోంది. ఇది తమ గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డుకునే వరకు వెళుతోంది.
గోడు ఎవరికి చెప్పుకోవాలి..?
ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న విషయం ఎవరికి చెప్పుకోవాలో కూడా గ్రామ స్థాయి నేతలకు తెలియడంలేదు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గానీ, జిల్లా ఇన్చార్జి మంత్రులుగానీ అందుబాటులో ఉండడం అరుదుగా కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసి 7 నెలలు కావస్తున్నా నేటికి జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించలేదంటే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక ఓడిపోయిన నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం..?
గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకంతో అప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన వారికి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి పని లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఇతర ఏ పనికైనా సరే ప్రజలు వాలంటీర్లను సంప్రదిస్తున్నారు. ఎక్కడైనా కార్యర్తలు, నేతలు ప్రజల పని కోసం అధికారులను కలిసినా.. ‘మీ వాంటీర్ ఉన్నాడుగా అతని ద్వారా పంపండి’ అని సమాధానం ఇస్తున్నారు. పథకాలకు సంబంధించిన పత్రాలు, వస్తువులు కూడా వాలంటీర్లే ప్రజలకు పంచుతుండగా పార్టీ గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలు, నాయకులు బేలచూపులు చూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు.
9 ఏళ్లు పార్టీ కోసం, ఎన్నికల్లో గెలుపుకోసం సమయం కేటాయించి, ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్న తమను పార్టీ నిర్లక్ష్యం చేసిందన్న బలమైన భావనలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు ఉన్నారు. ఈ ప్రభావం రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న భయంతో పోటీ చేయాలనుకుంటున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు ఉన్నారు.