iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ

  • Published Sep 19, 2021 | 1:16 AM Updated Updated Sep 19, 2021 | 1:16 AM
వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనని ఏపీ ప్రజలు చాలామంది మరచిపోలేదు. ముఖ్యంగా ఆయన పాలనా పద్ధతులను పరిశీలించిన వారే కాకుండా వాటి ఫలితాలను అందుకున్న తరం కూడా వైఎస్సార్ ని అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫీజు రీయంబెర్స్ మెంట్ ద్వారా ఫలితం పొందిన విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న సమయంలో చాలామందికి ఆ పథకం ప్రారంభించిన నాయకుడు గుర్తుకొస్తూనే ఉంటారు. అయితే తూర్పు తీరంలోని ఓ మత్స్యకార గ్రామం నిత్యం వైఎస్సార్ నామస్మరణ చేస్తోంది. ఆయన ఉండి ఉంటే మరోలా ఉండేదని చెబుతోంది. తమకు రక్షణగా నిలిచేందుకు ఆయన ప్రదర్శించిన చొరవను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంది.

తూర్పు గోదావరి జిల్లా జిల్లా కేంద్రం కాకినాడకు సమీపంలో ఉన్న గ్రామం ఉప్పాడ. పూర్తిగా వృత్తిదారులు..అందులోనూ చేనేత, మత్స్యకారులు అత్యధికంగా జీవించే గ్రామం ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి పరంగా వస్తున్న మార్పులతో సముద్రపు కోతతో ఈ గ్రామం అల్లాడిపోతోంది. వందల ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. అనేక మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వారంతా తమను ఆదుకునేవారే లేరా అంటూ ఎప్పటికప్పుడు సముద్రుడిని వేడుకోవడమే తప్ప ఏమీ చేయలేని స్థితిలో సతమతమవ్వడం ఆనవాయితీగా మారింది.

Also Read: పంజాబ్ కొత్త సీఎం ఎవరు?

ఈపరిస్థితుల్లో రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు సముద్రపు కెరటాలపై భారం వేసి గడిపేవారు. సరిగ్గా ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి ఈ సమస్య వచ్చింది. అప్పట్లో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రిగా ఉన్న పళ్లంరాజు సహాయంతో కొంత ప్రయత్నం చేసినా కేంద్రం మాత్రం తొలుత కనికరించలేదు. దాంతో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన వైఎస్సార్ ముందుకొచ్చారు. సముద్ర తీరం కోతను నివారించేందుకు రక్షణగా జియో ట్యూబ్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. కేంద్రం నిధులతో కేవలం బీచ్ రోడ్డు వరకూ మాత్రమే దానిని పరిమితం చేయడంతో ఉప్పాడ గ్రామానికి విస్తరించాలని ఆయన సంకల్పించారు. కానీ నాటి అధికారులకు నిధు సమస్య వచ్చింది. ఏం చేయాలన్నది పాలుపోలేదు.

వెంటనే సీఎంగా వైఎస్సార్ సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా నీటిపారుదల శాఖ నిధులను సముద్రతీరం కోతను అడ్డుకోవడానికి కేటాయించారు. ఇప్పుడు చాలామందికి అదెలా సాధ్యమనే అనుమానం వస్తుంది. కానీ వైఎస్సార్ మాత్రం గ్రామాన్ని కాపాడడమే ముఖ్యం తప్ప ఏ నిధులు, ఏ శాఖ అనేది ముఖ్యం కాదంటూ నాటి అధికారులకు తెలియజేశారు.

సీఎస్ గా ఉన్న మోహన్ కందా కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా ఏలేరు ఆయకట్టు అభివృద్ధి నిధులను మళ్లించి ఉప్పాడను కాపాడాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో రూ. 12.6 కోట్లను కేటాయించి జియో ట్యూబ్ నిర్మాణం చేశారు. దాని ఫలితంగా ఉప్పాడ వాసులకు ఉపశమనం దక్కింది.

Also Read: ముఖ్యమంత్రులతో జాతీయ పార్టీల బంతులాట

సుమారు పదేళ్ల పాటు ఉప్పాడ గ్రామం కోత సమస్య నుంచి ఊరట పొందింది. కానీ వైఎస్సార్ మరణం తర్వాత ఆ జియో ట్యూబ్ పరిరక్షణ సక్రమంగా సాగకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో ఆ ట్యూబ్ దెబ్బతింది. మళ్లీ ఉప్పాడ విలవిల్లాడుతోంది. దాంతో ఆయనే ఉంటే మాకు ఈ సమస్య ఉండేది కాదంటూ ఉప్పాడ వాసులు గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు మేలు జరగాలే తప్ప నిబంధనలు, నిధులు విషయంలో వైఎస్సార్ ఎంత ఉదారంగా వ్యవహరించేవారన్నది ఈ ఉదాహరణ చాటిచెబుతోంది.