విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అధికార పార్టీ వైసీపీ తన వంతు పోరాడుతోంది. ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పునరాలోచించాలని కోరుతోంది. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించిన వెంటనే వైసీపీ ఎంపీలు దీనిపై కేంద్ర పెద్దలను కలుస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కును, ఆంధ్రుల హక్కును కాపాడుకుంటామన్నారు. మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ – అనర్థాలను ఆ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వైసీపీ ఎంపీలు కూడా ప్రైవేటీకరణ ఆగేలా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే జరిగే అనర్థాలను, తలెత్తే ఉద్యమాలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదే విషయమై ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.
రాజకీయ ఉద్యమాలకు అవకాశం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, లోక్‌సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట), మార్గాని భరత్ (రాజమండ్రి), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), మాగుంట శ్రీనివాసుల రెడ్డి (ఒంగోలు), డాక్టర్ బీవీ సత్యవతి (అనకాపల్లి).. కేద్రమంత్రిని కలిశారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. వైజాగ్ స్టీల్ ఫ్మాక్టరీ.. రాష్ట్రానికే ఆభరణం వంటిదని, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగమైందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ప్రైవేటీకరించడం వల్ల రాజకీయ ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఇదివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా విశాఖ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే ఉద్యమానికి వెంకయ్య నాయుడు సారథ్యాన్ని వహించారని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 17 వేల మందికి పైగా, పరోక్షంగా లక్ష మందికి పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ప్రైవేటీకరించడం వల్ల వారి జీవితాలు ప్రభావితమౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా పోరాటానికి సిద్ధం..
నవరత్నాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ స్టీల్‌ప్లాంటు విక్రయాన్ని తమ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మంత్రితో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు ఎంపీలు చెప్పారు. దీనిపై మంత్రి ఆమె కూడా సానుకూలంగా స్పదించారని, ప్లాంటు లాభాల బాటలోకి నడిపించడానికి తగిన సూచనలివ్వాలని కోరారని తెలిపారు. దీంతో.. కేప్టివ్ మైన్స్(సొంత గనులు) కేటాయించాలని, పునర్నిర్మాణం, పునరుద్ధరణ, పునర్‌మూల్యాంకనం(రీస్ట్రక్చరింగ్, రీవాంపింగ్, రివైజ్డు-ఆర్‌ఆర్‌ఆర్) విధానాన్ని అమలు చేస్తే కచ్చితంగా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని వివరించామని చెప్పారు. స్టీలుప్లాంటును ప్రైవేటీకరిస్తే రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్లాంటు విస్తరణ కోసం తెచ్చిన అదనపు రుణాలను క్యాపిటల్ కింద మార్చాలని కోరినట్లు చెప్పారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ప్రజల శాపం తగులుతుందని, అలాగే, ప్రజలను జాగృతం చేసి పోరాడతామని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి అన్నారు. అలాగే.. పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలలో పెండింగ్ ఉన్న హామీలను అమలు చేయాలని ఆర్థికమంత్రిని కోరినట్లు చెప్పారు.