iDreamPost
android-app
ios-app

గెలిచి నిలిచిన యడ్డి

  • Published Dec 09, 2019 | 10:59 AM Updated Updated Dec 09, 2019 | 10:59 AM
గెలిచి నిలిచిన యడ్డి

ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాలలో 12 సీట్లు గెలవటం ద్వారా బీజేపీ,యడ్యూరప్ప పట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ రెండు స్థానాలలో ,స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు.

గత మే నెలలో జెడిఎస్, కాంగ్రెస్ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటంతో వారిపై అనర్హత వేటు పడింది. దీనితో ఖాళీ అయిన 17 స్థానాలలో 15 స్థానాలకు ఉప ఎన్నికలకు డిసెంబరు 5న జరిగిన పోలింగ్‌ జరిగింది. ఓటరు జాబితా నామీద కోర్టులో వివాదం నడుస్తుండటం వలన రెండు స్థానాలలో ఎన్నికలు జరగలేదు.

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీకి సహకరించిన రెబల్స్ ఇప్పుడు బీజేపీ టికెట్ పై ఎన్నికల్లో పోటీచేశారు.మొత్తం 225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో శాసన సభ్యుల సంఖ్య 208కి చేరింది. ప్రస్తుతం బీజేపీ తరుపున 105 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తునన్నారు . బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఆ పార్టీ కనీసం 6 స్థానాల్లో కచ్చితంగా గెలవాల్సి ఉండగా, ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందటంతో ఆ సంఖ్య 117కి చేరింది.దాంతో సంపూర్ణమైన మెజారిటీ యడ్యూరప్ప సాధించారు.

మరో వైపు కనీసం 10 స్థానాలు గెలుస్తామని విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ కేవలం రెండే స్థానాల్లో గెలుపొందడంతో, ఈ ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఒక్క సీటు కూడా గెలవలేకపోవటం JDS కు తీవ్ర విఘాతం.

బీజేపీ సీనియర్ నేత,లోక్ సభ సభ్యుడు బచ్చే గౌడ కొడుకు శరత్ కుమార్ బీజేపీ తనకు కాకుండా కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎంబీటీ నాగరాజుకు టికెట్ ఇవ్వటంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. ఇతను బీజేపీ లో చేరటం లాంఛనమే.

మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోయిన బీజేపీ కర్ణాటకలో నేటి ఉప ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని కాపాడుకోవటంలో సఫలీకృతం అయ్యింది.

అయితే ఈ ఫలితాల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది.సీఎల్పీ పదవికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య,కేపీసీసీ పదవికి గుండూరావు రాజీనామా చేసారు.