iDreamPost
android-app
ios-app

వైసీపీ ఎంపీల పోరాటం ఫ‌లించేనా?

వైసీపీ ఎంపీల పోరాటం ఫ‌లించేనా?

సువిశాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాజధాని, వేల కోట్ల ఆస్తులు అన్నీ తెలంగాణ‌కు చెందిన‌ హైదరాబాద్‌లోనే మిగిలిపోయాయి. రాజధాని లేదు. ఆదాయం లేదు. పాతాళంలా కనిపించే రెవెన్యూ లోటు. రాష్ట్రం కొత్త‌గా ఏర్ప‌డిన‌ట్లే. మళ్లీ మొదటి నుంచి మొద‌లుపెట్టాల్సిందే. దీంతో సగటు ఆంధ్రుడి గుండె చెరువైపోయింది. విభ‌జ‌న సంద‌ర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు కొంత ఊర‌ట‌. అందులో ప్ర‌ధాన‌మైన‌ది, ఏపీ అభివృద్ధికి అత్యంత అవ‌స‌ర‌మైన‌ది ప్ర‌త్యేక హోదా. ఆ హోదా ఉంటే 90 శాతం నిధులను కేంద్రం కేటాయిస్తుంది. అందుకే హోదా కోసం యావ‌త్త్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం కూడా దాని కోసం పార్ల‌మెంట్ లోనూ, బ‌య‌ట పోరాటం సాగిస్తోంది. కానీ ప్ర‌త్యేక ప్యాకేజీ.. ప్ర‌త్యేక హోదాకు అడ్డు త‌గులుతోంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారింది.

విభ‌జ‌న‌తో వేరు ప‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జల్లో ఒక్క‌టే నిరాశ‌. నిరాశ‌లో ఉన్న ఆ ప్ర‌జ‌లు రాజ‌కీయంగా అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అయితేనే.. రాష్ట్రాన్ని మ‌ళ్లీ గాడిన పెట్ట‌గ‌ల‌ర‌ని న‌మ్మారు. అందుకు ఆయ‌న చేసిన విప‌రీత‌మైన ప్ర‌చారం కూడా ప్ర‌భావితం చేసింది. ప్ర‌త్యేక హోదా సాధ‌నే ప్ర‌ధాన ఎజెండా అని ప్ర‌క‌టించారు. అప్ప‌టికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య‌మంత్రిగా చేసి ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. ఆయన మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒడ్డున పడేయగలడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు న‌మ్మారు. తెలుగుదేశం పార్టీకి పట్టంగట్టారు. ఫ‌లితంగా జూన్ 8, 2014న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌కు కేంద్రం ప్ర‌తిపాద‌న‌ల‌కు త‌లొగ్గి ప్ర‌త్యేక హోదా ను ప‌క్క‌న పెట్టేశారు.

ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తుంటే.. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రానికి తలొగ్గి 2016 సెప్టెంబరులో ప్రత్యేక ప్యాకేజీకి అంగీక‌రించారు. 2016 అక్టోబర్‌ 24న కేంద్రానికి లేఖ కూడా రాశారు. చంద్రబాబే స్వయంగా సంతకం చేసి ఆ లేఖను పంపారు. దీనిపై ప్ర‌జ‌ల్లో ఆగ్రహావేశాలు వ్య‌క్తం కావ‌డం, నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ గ‌ట్టిగా పోరాడ‌డంతో చంద్ర‌బాబు మాట మార్చారు. దానికి తోడు బీజేపీతో టీడీపీకి ఉన్న అనుబంధం చెడింది. అనంత‌రం ప్యాకేజీకి ఒప్పుకుంటూ స్వ‌యంగా లేఖ రాసిన చంద్ర‌బాబు.. మ‌ళ్లీ ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను వంచించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో నాటి కేంద్ర పెద్ద‌లు చంద్ర‌బాబు బండారాన్ని బ‌య‌ట పెట్టారు. నాటి మంత్రి పీయూష్‌ గోయెల్ కేంద్రానికి బాబు రాసిన లేఖ‌ల‌ను మీడియా ముందు బ‌హిర్గ‌తం చేయ‌డంతో ఆయ‌న బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది.

ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారం కోల్పోవాల్సి వ‌చ్చింది. బాబు సంగ‌తి ప‌క్క‌న పెడితే.. నాడు ఆయ‌న చేసిన త‌ప్పే నేడు రాష్ట్రాన్ని ప‌ట్టి పీడిస్తోంది. వైసీపీకి చెందిన‌ 22 మంది ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోసం ప‌ట్టుబడుతున్న‌ప్ప‌టికీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లి స్వ‌యంగా కేంద్ర పెద్ద‌ల‌కు విన్న‌విస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టికీ స‌రైన హామీ రావ‌డం లేదు. దీంతో తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో మ‌రోమారు వైసీపీ ఎంపీలు హోదా కోసం గ‌ర్జిస్తున్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది? అంటూ ప్ల‌కార్డుల‌తో ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. కానీ కేంద్రం మాత్రం నాడు చంద్ర‌బాబు రాసిన లేఖ‌ల‌ను, ఒప్పంద ప‌త్రాల‌ను సాకుగా చూపి అదిగో.. ఇదిగో అంటూ దాట‌వేస్తూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా వైసీపీ ఎంపీలు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కూ వెనుక‌డుగు వేసేది లేద‌ని తెగేసి చెబుతున్నారు.