వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులకు ఆపార్టీ సీనియర్ నేతలు అడ్డుపడుతున్నారనే విషయం ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అర్ధమవుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రాలవారీగా కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్న కాంగ్రెస్ కోర్ టీమ్ కు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్లు ఏ మాత్రం సహకరించడం లేదు.
అధికారం కోసం పోరాడుతున్న పార్టీకి అండగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన సమయంలో తమ వ్యక్తిగత రాజకీయలబ్ధికి పరిమితమవుతున్నారు. తాము ఇన్నాళ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఔట్ డేటడ్ అయిపోయిందంటూ అధికారంలో ఉన్న పార్టీలలోకి జంప్ అవుతున్నారు. పాతనీరుపోయి కొత్తనీరు వచ్చిందన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి ఉన్నప్పటికీ ఈ పరిణమాలు మేలు చేస్తాయా లేదా అనేది సమాధానంలేని ప్రశ్నగా మిగిలింది.
గోవా మాజీ ముఖ్యమంత్రి ఫలీరో , ఏడు సార్లు చట్టసభలకు ప్రాతినధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్ ను వదిలి తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పనిపోయిందనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఇక దేశంలో బీజేపీకి తృణముల్ మాత్రమే ఆల్టర్నేటివ్ అన్నారు. మమతా బెనర్జీనే విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి అంటూ రాజకీయ జోస్యం చెప్పారు. యూపీలో కూడా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద్ .. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరి యోగి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ కూడా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. త్వరలోనే అధికారికంగా కాషాయ కండువా వేసుకుంటారని తెలుస్తోంది.
Also Read : సిద్ధూ తీరు.. రాహుల్ , ప్రియాంకలను ఇరకాటంలో పడేసిందా?
పార్టీని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ తన ఆశలు మాత్రం యువనాయత్వంపైనే కాంగ్రెస్ పెట్టుకున్నట్లు కనబడుతోంది. హిందుత్వ అజెండాతో దేశంలో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీని ఎన్నికల్లో దెబ్బకొట్టాలంటే అందుకు తగ్గ కొత్త నాయకత్వం అవసరమని ఆలస్యంగా అర్థం చేసుకుంది. వాగ్ధాటి, దూకుడు, సమయ స్ఫూర్తి ఉన్న ప్రజాకర్షక నేతలను జల్లెడ పట్టి వెతికి మరీ కీలక పదవులు కట్టబెడుతోంది. ఎస్సీలకు అత్యున్నత పదవులు కట్టబెడుతూ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయాత్నాలు కూడా చేస్తుంది.
అలసట లేకుండా గంటల కొలది ఉపన్యాసాలు ఇస్తూ యువ ఓటర్లు ఆకట్టుకుని బీజేపీని దేశంలో అతిపెద్ద పార్టీగా డెవలప్ చేసిన మోదీ కి పోటీ ఇచ్చే నాయకులు కాంగ్రెస్ లో లేకుండా పోయారు. దీంతో తమ వైఫల్యాలు, బలహీనతలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్, రాష్ట్రాల వారీగా యువనాయకత్వాన్ని తయారు చేస్తోంది. వారే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ముఖ్యనాయకులుగా ఎదిగి ప్రత్యర్థులతో తలపడి విజయం సాధించేలా తర్ఫీదు ఇవ్వబోతుంది. వాగ్ధాటి, ప్రజాకర్షక, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇతర పార్టీల నేతలతో పాటు ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారిని తమపార్టీలోకి ఏరి కోరి తెచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ.
Also Read : అమిత్‌షాతో అమరిందర్ భేటీ.. బీజేపీలో చేరిక, కేంద్రమంత్రి కావటం లాంఛనమే?
ముందుగా గుజరాత్ లో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్, అక్కడ ప్రజాకర్షక నేతలను తమ పార్టీలోకి తీసుకుంది. పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్థిక్ పటేల్, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. గుజరాత్ లో ఆర్థికంగా బలమైన పటేల్ సామాజికవర్గం రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుండటంతో ఈ యువనేతకు కాంగ్రెస్ ప్రాధాన్యమిచ్చింది.
ఇక అట్టడుగు వర్గాలకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని కూడా అనధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. జిగ్నేశ్ మేవాని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఉద్యమ నేత. అతను గత ఎన్నికల్లో స్వంతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పోటీ చేయకుండా మద్దతు తెలిపింది. సొంత ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ మద్దతుతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే బ్యాలెట్ ఫైట్ చేయబోతున్నారు. న్యాయవాది అయిన జిగ్నేశ్కు లోకల్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్. ప్రసంగాలతో ఓటర్లు ఆకర్షించగలనేత.
ఇక ఆ పార్టీకి దొరికిన మరో యువనేత కన్హయ్య కుమార్. జేఎన్ యూ మాజీ విద్యార్థి నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బిహర్ కు చెందిన కన్హయ్య గత ఎన్నికల్లో సీపీఐ తరఫున బెగుసరాయ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి కల్ రాజ్ మిశ్రా చేతిలో ఓడారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ లాంటి పార్టీ తోనే అది సాధ్యమని కన్హయ్య భావిస్తున్నారు. ఆటపాటలు, స్ఫూర్తి నింపే నినాదాలు ఇవ్వడంలో కన్హయ్య కుమార్ కు మంచి టాలెంట్ ఉంది. ఈ మాజీ కమ్యూనిస్టు ప్రసంగాలు కూడా ఉత్తేజభరితంగా ఉంటాయి.
Also Read : మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా? తృతీయ కూటమికి అది విఘాతమేనా