iDreamPost
iDreamPost
తాను అధికారానికి దూరమయ్యాను కనుక తన ప్రత్యర్థి జగన్ కూడా అధికారంలో ఉండకూడదు, అతనిని వెంటనే అధికారం నుంచి తప్పించాలి అనేదే ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అజెండాగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుంగిపోయి చాన్నాళ్లు హైదరాబాద్ కే పరిమితమైన ఆయన ఇక తట్టుకోలేక బయటకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే తమ పార్టీ నేతల ద్వారా బూతుల పంచాంగం చదివించి వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వారు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్ళినప్పుడు జరిగిన స్వల్ప ఘటనలను విధ్వంసంగా చిత్రీకరించి రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నట్లు ప్రచారం చేయించుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోనులో ఫిర్యాదు చేయడమే కాకుండా రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర గవర్నర్ వద్దకు టీడీపీ బృందాన్ని పంపారు. శనివారం ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు స్వయంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ప్రయత్నాలన్నీ అర్జెంటుగా జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించేలా చేయడానికే. కానీ చంద్రబాబు కోరిన వెంటనే రాష్ట్రపతి పాలన విధించేస్తారా? రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా?రాష్ట్రపతి పాలన ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలు.. వాటిపై చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
ఆర్టికల్ 356 ఉద్దేశం ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 రాష్ట్రాల పాలనలో కేంద్ర జోక్యానికి సంబంధించి పలు నిర్వచనాలు, అధికారాలు నిర్దేశించింది. ఏదైనా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడి ప్రజాపాలన సాగే పరిస్థితులు లేనప్పుడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, దేశ సమైక్యత, సమగ్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నప్పుడు, ఇతరత్రా ప్రమాదకరమైన విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల పాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవచ్చని ఆర్టికల్ 356 నిర్వచించింది. కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టింది. దీన్నే రాష్ట్రపతి పాలన అంటారు. అయితే సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టికల్ 356 ప్రయోగించాల్సి ఉంటుంది. అది జరిగితే రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నరే పాలనా బాధ్యతలు చేపడతారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండరు, మంత్రివర్గం కూడా ఉండదు. రాష్ట్ర అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయడమో లేదా తాత్కాలికంగా సస్పెన్షన్(షుప్తాచేతనావస్థ)లో పెట్టడమో చేస్తారు.
గతంలో దుర్వినియోగం.. సుప్రీం పరిమితులు
ప్రత్యేక సందర్భాలు, అనివార్య పరిస్థితుల్లోనే అమలు చేయాల్సిన ఆర్టికల్ 356 గతంలో చాలా దుర్వినియోగమైంది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి రాగా 1954లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌లో ఆర్టికల్ 356 అమలు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత రాజకీయ కారణాలతో అప్పటి కాంగ్రెస్, జనతా ప్రభుత్వాలు ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసాయన్న ఆరోపణలు ఉన్నాయి. 1966-1977 మధ్య కాలంలో ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 39 సార్లు 356 అధికరణాన్ని రాష్ట్రాలపై ప్రయోగించారు. జనతా ప్రభుత్వం ఉన్న రెండున్నరేళ్లలో తొమ్మిదిసార్లు అమలు చేశారు. 1994లో కర్ణాటక సీఎం ఎస్సార్ బొమ్మై ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించిన కేసు సంందర్భంగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 356 వినియోగంపై పలు వ్యాఖ్యలు చేసి పరిమితులు విధించింది. అత్యవసరం, అనివార్యత ఉన్నప్పుడే ఈ ఆర్టికల్‌ని వినియోగించాలని, తమకు నచ్చని ప్రభుత్వాలపై కేంద్రం ప్రయోగించకూడదని స్పష్టం చేసింది. 1983లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా ఇదే తరహా సూచనలు చేశారు. అప్పటి నుంచే 356 వినియోగం బాగా తగ్గింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు
ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు.. అయినా తనకు అవసరమైనప్పుడు అవేవీ ఆయనకు గుర్తుకురావు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించదగ్గ పరిస్థితులు లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, పోలీసుల పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ ఇటీవలే ప్రశంసించింది. ఇక డ్రగ్స్ కేసులో ఒక్క చిరునామా తప్ప ఏపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ,ఈడీ ఇప్పటికే ప్రకటించాయి. గంజాయి రవాణా రాష్ట్రంలో ప్రధానంగా విశాఖ జిల్లా నుంచి గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలు తప్ప మిగతా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అసలు లేదు. ఈ పరిస్థితుల్లో కేవలం రాజకీయ కారణాలతో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులతో రాష్ట్రపతి పాలన ఎలా విధిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.