iDreamPost
iDreamPost
విశాఖలో ఆక్రమణల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా ఎంవీపీ కాలనీలో కార్పోరేషన్ భవనం ఖాళీ చేయించేయత్నం జరిగింది. అయితే దానిని మానిసక వికలాంగుల పునరావాస కేంద్రం పేరుతో వినియోగిస్తున్న శ్రీనివాసరావు అనే లీజుదారుడు రాజకీయం చేసేందుకు యత్నించడంతో చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ నేత నారా లోకేష్ వంటి వారు కూడా దీని మీద వ్యాఖ్యానించారు. తాజాగా బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ప్రసాద్ కూడా స్పందించారు. సీఎం, విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని ఆ కేంద్రం కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
అయితే విశాఖలోని రేషన్ హిడెన్ స్పార్టస్ స్కూల్ పేరుతో నడుస్తున్న ఈసంస్థ గడిచిన ఏడాదిన్నరగా మూతపడింది. మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం కోవిడ్ కారణంగా మూసివేయాల్సి వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకుడు కె.శ్రీనివాస రావునకు, విశాఖపట్నం సెక్టార్ -12, ఎంవిపి కాలనీ యొక్క రిజర్వు చేసిన బహిరంగ ప్రదేశంలో ఉన్న పాత శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని 2013 సంవత్సరంలో ఒక సంవత్సర కాలమునకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన తాత్కాలిక వసతిగా లీజుకి ఇచ్చారు. అయితే 8 సంవత్సరాలుగా అదే తక్కువ లీజుతో ఆయన కొనసాగిస్తున్నారు. కేవలం నెలకు రూ 3వేలు అద్దె చెల్లిస్తూ సంస్థ నడుపుతున్నారు. పైగా ఆ భవనాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో షెడ్లు నిర్మించి వాడుతున్నారు.
ఈ నేపథ్యంలో జివిఎంసి ఆ స్థలాన్ని ఖాళీ చేయమని కోరింది. దాని స్థానంలో ప్రత్యామ్నాయ కమ్యూనిటీ హాల్ కూడా కేటాయించింది. అయినా ఆయన స్పందించలేదు. ఆ జారీ చేసిన నోటీసు ఆర్సి దృష్ట్యా, 01.06.2021 నాటి 467968/2020 / లీజులు / జోన్ 3 (రాబడి), జివిఎంసి కార్యాలయాన్ని జివిఎంసి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించి తేదీ 04.06.2021 లోగా ఖాళీ చేసి, ఆ ప్రాంగణాన్ని జివిఎంసి అధికారులకు అప్పగించమని ఆదేశాలు వచ్చాయి. అది గమనించిన శ్రీనివాసరావు సరిగ్గా ఆక్రమణల తొలగింపు సమయంలో ఆటంకం కల్పించేలా కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వెంటపెట్టుకుని కొంత హైడ్రామా క్రియేట్ చేసినట్టు జీవీఎంసీ చెబుతోంది.
అయినా అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించడంతో చివరకు ఆ సంస్థకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థలంలో పాఠశాల నడుపుకోవడానికి నిర్వాహకుడు శ్రీనివాసరావు అంగీకరించారు. అయినా దానిని రాజకీయం చేసేందుకు కొందరు టీడీపీ నేతలు యత్నించడం విశేషం. అన్నింటా జగన్ ని బద్నాం చేయడమే లక్ష్యంగా ఏకంగా పులివెందుల పోలీసింగ్ అంటూ లోకేష్ పేర్కొనడం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని అంశాల్లోనూ రాయలసీమను, పులివెందులను ప్రస్తావించడం ద్వారా ప్రాంతీయ వివక్షతకు టీడీపీ నేతలు ప్రయత్నించడం వివాదంగా మారుతోంది. విశాఖలో మానిసిక వికలాంగుల పాఠశాల అంశంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించిన టీడీపీ లక్ష్యం నెరవేరే అవకాశం లేకపోవడంతో ఆపార్టీ నేతలు ప్రస్తుతం చల్లబడినట్టు కనిపిస్తోంది.