Idream media
Idream media
ఒకప్పుడు థియేటర్లో ఒక సినిమా వంద రోజులు ఆడితే గొప్పగా చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు థియేటర్లు మూసేసి వందరోజులు దాటింది. మళ్లీ ఎప్పటికీ తెరచుకుంటాయో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు సినిమా అంటే అందరిది. కొన్ని వందల మంది ఒకేసారి తెర మీద చూసి , రియాక్ట్ అయ్యేవాళ్లు. ఇప్పుడు ఎవరి సినిమా వాళ్లది.
కామెడీ సీన్ వస్తే థియేటర్ అంతా దద్దరిల్లేది. ఫైట్స్ వస్తే విజిళ్లు. ఎమోషన్ వస్తే ఏడుపు. ఇప్పుడు ఎవడి ఏడ్పు వాడిది. ప్రతి వాడు కరోనాతో ఫైటింగే.
విషాదం ఏమంటే మనుషులు ఫోన్లలో తప్ప నేరుగా మాట్లాడ్డం మానేశారు. ఒకప్పుడు ప్రతి మనిషి దగ్గర బోలెడు కథలుండేవి. అందరికీ చెప్పాలనే తపన ఉండేది. వినే వాళ్లు కూడా ఉండేవాళ్లు. ఇప్పుడు వినే ఓపిక ఎవరికీ లేదు. అందుకే డిప్రెషన్, ఒంటరితనం, చివరికి ఆత్మహత్య. ఒక మనిషి ఎపుడు చచ్చిపోతాడంటే , తన బాధని వినేవాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరనే నిర్ధారణకి వచ్చినప్పుడు.
పూర్వపు రోజుల్లో ఆత్మహత్యలు ఎందుకు తక్కువగా ఉండేవంటే మనుషులు విపరీతంగా మాట్లాడుకునేవాళ్లు కాబట్టి. ఫోన్లో ఎంత సేపు మాట్లాడినా మన ఆత్మ అవతల అర్థం కాదు. నిజానికి కళ్లు మాట్లాడినంత అద్భుతంగా నోరు ఎప్పటికీ మాట్లాడలేదు.
సినిమా అంటే కలల వ్యాపారం. టికెట్ తీసుకుని ఒక కలని కొనుక్కుంటాం. మనది కాని జీవితాన్ని , కలని చూసి సంతోషిస్తాం. థియేటర్ అంటే కలల సంత. నటులు డ్రీమ్ మర్చంట్స్.
మా ఊళ్లో అంజినప్ప అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు. నలుగురు పిల్లలు. ఒకరికి పోలియో. ముగ్గు వాసన వచ్చే అంగడిలో మురికి పట్టిన స్టూల్ మీద కూచొని బీడీలు, సిగరెట్లు, నూకలు, జొన్నలు అమ్మేవాడు. అతని కస్టమర్లంతా పేదవాళ్లు. అర్ధ రూపాయికి బియ్యం అడిగే వాళ్లు (ఆ రోజుల్లో కిలో రెండు రూపాయలు). అంజినప్ప తెల్లారి అంగడి తీస్తే , రాత్రి 9 గంటలకే మూత. అన్నం కూడా అక్కడికే వచ్చేది.
వారమంతా గుంజకి కట్టేసిన ఎద్దులా, అంగట్లో ఉండి , ఆదివారం ఉదయం బస్సుకి బళ్లారి వెళ్లేవాడు. వరుసగా రెండు సినిమాలు చూసి రాత్రికి ఇల్లు చేరేవాడు.
సోమవారం ఉదయం నుంచి కస్టమర్లకి కథ స్టార్ట్ అయ్యేది. “నిన్న బళ్లారి రాయల్ టాకీస్‌లో నోము సినిమా చూసుకుని వస్తిని. పాము ఏం చేసిందో తెలుసా? ” అని ప్రారంభించి నాగుపాము పగపట్టే కథలన్నీ జలజలా రాలేవి.
అప్పు పెట్టే కస్టమర్లైతే శ్రద్ధగా వినేవాళ్లు. ఆ వారమంతా ఆ సినిమా రీళ్లు వందల సార్లు తిరిగేవి. మళ్లీ వారం కొత్త కథ.
నటరాజ్ థియేటర్లో 70 MMలో షోలే చూసి వచ్చిన రోజు ఆయన ఉత్సాహానికి పగ్గాల్లేవు. హిందీ అర్థం కాదు కానీ, షోలే మామూలు సినిమా కాదని గ్రహించాడు.
“వాడుండ్రా గబ్బర్‌సింగ్ , నవ్వించి , నవ్వించి కాల్చి చంపుతాడు రా ” ఊళ్లో సగం మందికి షోలే సినిమా చూపించేశాడు.
ఇంటికెళితే పేదరికం. అంగట్లో సరుకులున్నా తీరని ఆకలి. పుండులాంటి జీవితానికి , సినిమా కథ ఒక లేపనం.
రాయదుర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ. అత్యంత కష్టమైన పనుల్లో నేత ఒకటి. జీవితం మగ్గం గుంటలో దిగబడి పోతుంది. నూలు వాసనతో నిండిపోతుంది. నాకు తెలిసిన దంపతులకి పిల్లల్లేరు. వారంలో ఆరు రోజులు మగ్గం శబ్దమే. గురువారం సంతరోజు కూలి డబ్బులొస్తాయి. ఆ రోజు మటన్ తెచ్చుకుని కడుపు నిండా తింటారు. సాయంత్రం సినిమాకి వెళ్తారు. భర్త మగవాళ్ల నేలలో, భార్య ఆడవాళ్ల క్లాస్‌లో. ఇంటికి వస్తున్నంత సేపూ సినిమా కబుర్లే.
వారమంతా ఆ కథనే చెప్పుకుంటారు. గుర్తు చేసుకుంటారు. నవ్వుతారు, బాధపడతారు.
“రేలంగి, రమణారెడ్డి ఉంటే చాలబ్బా ” – అని మొగుడు నవ్వుతాడు.
“రాజనాలను చూస్తే నాకు కంపరం అయితాది “-పెళ్లాం భయం.
ఫెయిల్యూర్ మధ్యే జీవించేవాళ్లు, ఓటమే జీవితమైన వాళ్లు ఎందరో సినిమాలు చూసి కలలు పొదుగుకుంటారు.
రామున్ని చూశామా? రావణాసూరున్ని చూశామా? అన్నీ సినిమానే కదా చూపించింది.
వంద ఏళ్లుగా సినిమా అమృతాన్ని పంచింది. ఆక్సిజన్ ఇచ్చింది.
సినిమాలు చూసి మేమంతా బతికేస్తూ ఉంటే, సినిమాలు చూపించాల్సిన నువ్వు ఎందుకు చనిపోయావ్ సుశాంత్?
కాఫీ డే సిద్ధార్థ్ చనిపోయినప్పుడు బాధ కలిగింది.
కానీ హీరో సుశాంత్ రాజ్‌పుత్ చనిపోతే ఎవరూ ఇంట్లో మనిషి పోయినట్టు అనిపించింది. సుశాంత్ టీవీలో కనిపించేవాడు, ఫోన్‌లో కనిపించేవాడు.
ఓడిపోయిన వాళ్లు ఎందరో బతికేస్తూ ఉంటే, గెలిచిన వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు. ధోనీగా యాక్ట్ చేసిన వాడికి తెలియదా? ప‌్రతి బాల్ సిక్సర్ వెళ్లదని!
ఓటమి కంటే గెలుపుని నిభాయించుకోవడం, భరించడమే కష్టం.
ఇర్ఫాన్‌ఖాన్ కూడా చనిపోయాడు.
కానీ ఒక వీరుడిలా మృత్యువుతో పోరాడి పోరాడి చనిపోయాడు.
సుశాంత్ పోరాటమే లేకుండా మృత్యువుని కౌగిలించుకుని చనిపోయాడు.
ఈ కాలం కుర్రాళ్లకి బతకడం కంటే
చావకుండా ఉండడం ఎలాగో నేర్పించాలేమో!