తెలుగుదేశం పార్టీ కీలక నేత, సీనియర్ ఎమ్మెల్యే సైలెన్స్ చర్చనీయాంశంగా మారుతోంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మౌనం టీడీపీ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నా ఆయన పట్టనట్టే ఉండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే పయ్యావుల పరిస్థితి ఏమిటన్నదే వారికి అంతుబట్టడం లేదు. దాంతో కీలక నేత మౌనం ఇప్పుడు టీడీపీని కలవరపరుస్తోంది.
పయ్యావుల కేశవ్..టీడీపీలో కాస్త నోరున్న నేత. విషయ పరిజ్ఞానంతో పాటుగా అది ప్రజలకు అర్థమయ్యేలా వివరించగల సామర్థ్యం ఆయన సొంతం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఆయన చాలా చొరవగా కనిపించేవారు. వైఎస్సార్ హయంలో కూడా నిత్యం మీడియాలో కనిపించేవారు. అటు సభలోనూ ఇటు బయట కూడా ఆయన ఉత్సాహంగా వ్యవహరించేవారు. టీడీపీకి పెద్ద గొంతు గా నిలిచేవారు. అలాంటిదిప్పుడు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటుగా కీలక రాజకీయాంశాలలోనూ పెద్దగా స్పందించడం లేదు. టీడీపీ యావత్తు కదులుతున్న అంశంలో కూడా ఆయన పెదవి విప్పడం లేదు.
అమరావతి విషయంలో చంద్రబాబు ఏకంగా డెడ్ లైన్లు పెట్టే వరకూ వెళ్ళారు. రాజీనామాల విషయంపై పీలర్లు ఇస్తూ ఊహాగానాలకు తెరలేపారు. రాజధాని అంశంలో ఆయన పట్టుదలతో ఉన్నట్టు కనిపించారు. కానీ చివరకు ఉసూరుమనిపించడంతో టీడీపీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. అలాంటి విషయాల్లో కూడా పయ్యావుల ఎందుకు నోరు మెదపడం లేదన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. వాస్తవానికి ఆయన టీడీపీ అధినేత తీరుతో సంతృప్తిగా లేరని ప్రచారం సాగుతోంది. చివరకు అనంతపురం రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్న దాఖలాలు లేవు. సొంత నియోజకవర్గంలో కూడా చొరవగా కనిపించడం లేదు. ఇలా అటు పార్టీ కార్యకలాపాలు, ఇటు ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాల్లో పయ్యావుల తీరు విశేషంగా మారింది.
పయ్యావులకేమయ్యిందోననే ప్రచారం ఊపందుకుంది. నాయకుడు నిస్ప్రహలో ఉండడంతో పయ్యావుల అనుచరులు కూడా చొరవ చూపలేకపోతున్నారు. దాంతో ఉరవకొండలో వైఎఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా మారుతున్నారు. ఇది ఆపార్టీకి పెద్ద దెబ్బ కాగలదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఢీ అంటే ఢీ అనే రీతిలో ఇప్పటి వరకూ తలబడుతున్న చోట హఠాత్తుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో ప్రస్తుతం విపక్ష టీడీపీ శిబిరం వెలవెలబోతున్నట్టు కనిపిస్తోంది ఇది ఉరవకొండ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.