iDreamPost
iDreamPost
విశాఖ మన్యం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి వైఎస్ హయాంలో మంత్రిగా రాణించిన పసుపులేటి బాలరాజు ప్రస్తుతం వనవాసం చేస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల చేతిలో కిడ్నాప్ అయ్యి జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిన ఆయన తర్వాత మంత్రి అయినా.. 2014 నుంచి తెర వెనక్కి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నుంచి జనసేనలోకి.. అక్కడి నుంచి వైఎస్సార్సీపీలోకి మారిన ఆయన మరోసారి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
1989లో తొలి అవకాశం
విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి (జీకే వీధి)కి చెందిన బాలరాజు స్వయంకృషితో పైకి వచ్చారు. అన్నామలై యూనివర్సిటీలో పీజీ చేసిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు కండక్టరుగా, టీచరుగా పనిచేశారు. 1985లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. వాల్మీకి తెగకు చెందిన బాలరాజు 1989లో చింతపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు.
నక్సల్స్ కిడ్నాపుతో వార్తల్లోకి
చింతపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాలరాజును 1993 జనవరి 30న మావోయిస్టులు ఆయన్ను కిడ్నప్ చేశారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, మరికొందరు ఇంజినీరింగ్ అధికారులను కిడ్నాప్ చేసిన నక్సల్స్ జైల్లో ఉన్న తమ నేత క్రాంతి రణదేవ్ ను విడుదల చేయాలని షరతు పెట్టారు. చివరికి 29 రోజుల అనంతరం ఎమ్మెల్యే, మిగిలినవారు నక్సల్స్ నుంచి విముక్తి పొందారు. ఈ ఘటనతో బాలరాజు పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించలేదు. దాంతో 1994, 1999, 2004 ఎన్నికల్లో పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా, స్వతంత్రంగా పోటీ చేశారు.
వైఎస్ ద్వారా వెలుగులోకి
మళ్లీ 2009 ఎన్నికల్లో వైఎస్ ద్వారా బాలరాజుకు పోటీ చేసే అవకాశం లభించింది. ఈసారి పాడేరు టికెట్ సంపాదించిన ఆయన విజయం సాధించడమే కాకుండా వైఎస్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ తదనంతరం కిరణ్ కుమార్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి చేతిలో ఓడిపోయారు.
మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ ద్వారా నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించి రోడ్లు, తాగునీటి పథకాలు, హాస్టల్ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేయించిన బాలరాజు 2018లో కాంగ్రెసును వీడి జనసేనలో చేరారు.
2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసిన బాలరాజు కేవలం ఆరు వేల ఓట్లు మాత్రమే సాధించాడు.
కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోయిన 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరుపున పోటీచేసిన బాలరాజుకు 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా పోటీచేసిన కనీసం 10-12 వేల ఓట్లు సాధించుకోగల బాలరాజుకు జనసేన తరుపున కేవలం ఆరు వేల ఓట్లు రావటంతో ద్రిగ్భ్రాంతికి గురయ్యాడు. మరో వైపు జనసేన రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోవడంతో తన భవిష్యత్తును వెతుక్కుంటూ 2020 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరారు. ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలో లేకపోయినా నాయకత్వం తనను గుర్తించి అవకాశం ఇస్తుందన్న ఆశతో ఉన్నారు