iDreamPost
iDreamPost
పరకాల ప్రభాకర్. గత ప్రభుత్వంలో సలహాదారు పాత్రలో చంద్రబాబు చెంత ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత అనూహ్యంగా తెరమరుగయ్యారు. మీడియా లో అప్పుడప్పుడూ కనిపిస్తున్నారు. సొంతంగా చానెల్ నిర్వహణకు పూనుకున్నారు. కొంతకాలం మహాటీవీని నడిపే పని కూడా చేశారు. మధ్యలో అక్కడ నుంచి జారుకున్నారు.. దాంతో పాటుగా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నిర్వహించే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. సర్వేలు కూడా నిర్వహించేయత్నంలో ఉన్నారు. ఇన్ని చేస్తూనే అప్పుడుప్పుడూ రాజకీయ అంశాల్లో వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు.
మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఇంగ్లీష్ పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. ఓవైపు తన భార్య కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండగానే పరకాల చేస్తున్న వ్యాఖ్యానాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక అదే సమయంలో కొంతకాలంగా అమరావతిపై ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించి మూడు రాజధానుల విషయాన్ని తప్పుబట్టారు. అన్నింటికీ కొనసాగింపుగా ఇటీవల పవన్ కళ్యాన్ ని పరోక్షంగా విమర్శించే పని చేశారు. దానిని సహజంగానే పవన్ ఫ్యాన్స్ జీర్ణం చేసుకోలేని స్థితి వచ్చింది. చివరకు పరకాల వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద పంచాయతీ జరుగుతోంది. ట్విట్టర్ లో వారి వైరం కొన్నిసార్లు హద్దులు దాటుతూ బూతుల వరకూ దారితీస్తోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి దగ్గరగా ఉండి, కీలక నేతగా వ్యవహరించిన పరకాల ఆ తర్వాత అనూహ్యంగా ఆపార్టీ నుంచి బయటకు రావడం అప్పట్లో ఓ సంచలనం. ప్రజారాజ్యం, ఆపార్టీ అధినేత మీద అదే కార్యాలయం నుంచి చేసిన విమర్శలు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత టీడీపీతో సన్నిహితంగా మెలిగిన పరకాల ఇప్పుడు హఠాత్తుగా పవన్ ని ఎందుకు విమర్శించారన్నదే ఆసక్తికరం. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలకం కావాలని ఆశిస్తున్నారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. దానికోసమే పవన్ ఫ్యాన్స్ ని కెలికి చర్చ జరిగితే తన ప్రయత్నాలకు లైన్ క్లియర్ అవుతుందని ఆశిస్తున్నారన్నది వారి వాదన.
కానీ పరకాల మాత్రం ప్రస్తుతం ఏపీకి దూరంగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే ఆయన సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. అలాంటి సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టాలని ఆశించడం అత్యాశే అవుతుంది. ఆ విషయం ఇప్పటికే అనేక సార్లు ఎదురుదెబ్బలు తిన్న పరకాలకి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు చెప్పుకున్నారు. కానీ తీరా ఇప్పుడు ఏపీకి సంబంధించిన అంశాలను పదే పదే ప్రస్తావించడం వెనుక అసలు కారణాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ పరకాల వంటి వారి ప్రభావం ఇప్పుడున్న రాజకీయాల్లో ఏమేరకు అన్నది ప్రశ్నార్థకంగానే చెప్పాలి. ఆయనకు మంచి ఇమేజ్ ఉన్న దశలోనే ఎన్నడూ రాణించిన చరిత్ర లేనప్పుడు ఇప్పుడు ఏం చేయగలుగుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.