iDreamPost
iDreamPost
అమెరికాకు చెందిన అత్యంత సంపన్నుల జాబితాలో ముందుండే పేరు ట్రంప్. ఎన్నో రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కింగ్ అనిపించుకున్న ఆయన ప్రభ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడంతోనే మసకబారిపోవడం మొదలైంది. కరోనా, అధ్యక్ష ఎన్నికలు తదితర కారణాల వల్ల వ్యాపారాలపై దృష్టిపెట్టకపోవడంతో వ్యాపార సామ్రాజ్య పతనం కూడా మొదలైంది. నష్టాలు, అప్పులు పెరుగుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ట్రంప్ తన ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నారు. తాజాగా వాషింగ్టన్ లోని అత్యంత విలువైన హోటల్ ను అమ్మకానికి పెట్టారు. ఒక ప్రముఖ సంస్థ దీని కొనుగోలుకు ముందుకు వచ్చిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఐదేళ్ల క్రితమే ప్రారంభం
ట్రంప్ కు ఉన్న వ్యాపార సంస్థల్లో హోటల్ ఒకటి. వాషింగ్టన్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ను ఐదేళ్లుగా అమెరికా మాజీ అధ్యక్షుడికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి మైలు దూరంలో పెన్సిల్వేనియా స్క్వేర్ లో ఉన్న పోస్టాఫీస్ భవనాన్ని 60 ఏళ్ల లీజుకు తీసుకుని అభివృద్ధి చేసేందుకు 2012లో ఒప్పందం కుదుర్చుకున్నారు. 263 గదులు, అన్ని హంగులు సమకూర్చి 2016లో అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్ వేసిన కొన్ని వారాల్లోనే ఈ హోటల్ ను ప్రారంభించారు. అప్పట్లో రిపబ్లికన్ పార్టీ కార్యకలాపాలకు ఇదే కేంద్రంగా ఉండేది. ఇప్పుడు అధ్యక్ష పదవి పోవడం, అప్పులు పెరగడంతో హోటల్ ను అమ్మకానికి పెట్టారు. మియామీకి చెందిన సీజీఐ మర్చెంట్ గ్రూప్ అనే సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. రూ.2790 కోట్ల ఈ డీల్ వచ్చే మార్చి నాటికి పూర్తి కావచ్చని సమాచారం.
70 మిలియన్ డాలర్ల అప్పు
ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. కానీ 150 మిలయన్ డాలర్ల లాభాల్లో ఉన్నట్లు ట్రంప్ ఆర్గనైజేషన్ లెక్కలు చూపింది. అయితే అమెరికన్ కాంగ్రెస్ జరిపిన దర్యాప్తులో ఈ హోటల్ 70 మిలియన్ డాలర్ల అప్పుల్లో ఉన్నట్లు తేలింది. ఏడాది క్రితం రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ట్రంప్ ఇటు వ్యాపారపరంగానూ నష్టాలపాలయ్యారు. కొన్నాళ్ల క్రితం కార్లు, విమానాలు అమ్మేశారు. ఇప్పుడు హోటల్ ను విక్రయానికి పెట్టడంతో ట్రంప్ దివాలా తీశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సహచరులు, అనుచరులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ట్రంప్ కు ఇవన్నీ మామూలేనని, గతంలో కాసినో వ్యాపారంలో ఐదుసార్లు తీవ్రంగా నష్టపోయినా కోలుకున్నారని అంటున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుందని ధీమాగా చెబుతున్నారు.
Also Read : Nellore ,Tdp Leader- మొన్న ఆత్మహత్యాయత్నం.. నిన్న అరగుండు, అర మీసం.. చర్చనీయాంశంగా మారిన టీడీపీ నేత!