iDreamPost
iDreamPost
ప్రశ్నిస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఉన్నా ఎవరిని ప్రశ్నించాలో తెలుసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించకుండా,ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు బాహాటంగా మద్దతు ఇస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్లు విధించటమేమిటని జనం విస్తుపోతున్నారు. ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై ఆయన ధోరణిని తెలియజేసింది.
అఖిలపక్షానికి డిమాండ్
ఈ సమస్యపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు. ” ఎంపీలు మౌనంగా ఉంటే ఏం లాభం. వైఎస్సార్ సీపీ మాటలకు అర్థాలే వేరులే. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించాలి” అని పవన్‌కల్యాణ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు..
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని జనానికి పిలుపు ఇవ్వడం ఎందుకో అర్థం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సవివరంగా కేంద్రానికి లేఖ రాసి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. కార్మికులకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. తన పరిధిలో ప్రజాస్వామ్య బద్ధంగా చేయగలిగినదంతా చేసింది. ఇకపై దీనిపై నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వంపై నేరుగా ఒత్తిడి తేవడం మాని ఎంపీలు ఉన్నారు గనుక రాష్ట్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి తెస్తామనడం వల్ల కాలయాపన జరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు.
ఆసక్తిగా ఎదురుచూసిన జనం..
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కార్మిక సంఘాలు 260 రోజులుగా పోరాటం చేస్తుంటే వారికి అనుకూలంగా ఇన్నాళ్లూ పవన్ మాట్లాడలేదు. పైగా తనను ఓడించిన వారి కోసం ఎందుకు పోరాడాలని కూడా ప్రశ్నించారు. ఎవరికి ఓట్లు వేశారో వారినే అడగండి అంటూ అలక పూనారు కూడా. ఏమైందో తెలియదు గాని
అక్టోబర్ 31 అని ముహూర్తం నిర్ణయించుకుని దీనిపై బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేత అధినేత పవన్ ఈ అంశంపై ఏం మాట్లాడతారా అని జనం ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆయన సుదీర్ఘ ప్రసంగంలో అందరికీ తెలిసిన విషయాలనే తనదైన శైలిలో చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, 32 మంది బలిదానం, కార్మికుల కష్టం, వారి త్యాగాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఎప్పటిలాగే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపైన విమర్శలు చేశారు. అసలు విషయానికి వచ్చే సరికి అంటే ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే బాధ్యతను ప్రజలు, కార్మికులకే వదిలేశారు. గతంలో తాను ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు తనను జనం ఒంటరిని చేశారని, అందుకని మీరు ముందు నిలబడి పోరాడితే నేను వెనుక ఉంటాను అని ఒక లాజిక్ కూడా చెప్పారు.
కేంద్రాన్ని తప్పనడం భావ్యం కాదట..
సమస్యకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా అసలు పెట్టుబడుల ఉపసంహరణ అనేది కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ పాపం ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిది కాదని మూలాలు గతంలోనే ఉన్నాయని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. ప్రైవేటీకరణ విషయంలో ఎంతసేపూ కేంద్రానిదే తప్పనడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని సూచించారు.
ప్రజలకు దెప్పి పొడుపు
తెలంగాణ వారికి ఉన్నంత కసి, ప్రేమ ఆంధ్రా వాళ్లకు తమ నేలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్లు, మా కులం అనుకునే దరిద్రమే తప్ప మనమంతా ఒక్కటి అనే భావన ఆంధ్రులకు లేదన్నారు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా?. తనకు ఎవరైతే ఓటు వేశారో వారి కోసం ఇక్కడకు వచ్చాను తప్ప అందరి కోసం ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. ఆ విధంగా తనను ఎన్నికల్లో ఓడించిన అంశంపై జనాన్ని దెప్పి పొడిచారు.
Also Read : Vizag Steel Plant Pawan Kalyan -విశాఖ స్టీల్ ప్లాంట్ సభ: లాజిక్ లేకుండా అలా ఎలా పవన్?