iDreamPost
android-app
ios-app

కానరాని కమ్యూనిస్టులు

కానరాని కమ్యూనిస్టులు

గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరుకుంది. 150 కార్పోరేటర్ స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అన్ని చోట్ల అభ్యర్థులను నిలిపింది. బీజేపీ 149, కాంగ్రెస్ 146 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు పోటా పోటీ ప్రచారాన్ని నిర్వహించాయి. వాడి వేడి వాగ్యుద్ధాలతో నగరం నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రచారంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు దూకుడును ప్రదర్శించాయి. కాంగ్రెస్, టీడీపీలు శక్తికొద్దీ ప్రయత్నించాయి. ఈ ప్రచార హోరులో కమ్యూనిస్టులు ఎక్కడా కానరాకపోవడం గమనార్హం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. సీపీఐ 17 చోట్ల, సీపీఎం 12 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. జాతీయ స్థాయి పార్టీలుగా గుర్తింపున్న ఈ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కనీస ప్రభావాన్ని వేయలేకపోవడం విషాదం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనేతలంగా హైదరాబాద్ పైనే దృష్టిసారించారు. దుబ్బాక గెలుపు తరువాత, గ్రేటర్ బలం పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్ని వాడుకోవాలనే ఎత్తుగడను పకడ్బందీగా అమలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొదలు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, ప్రకాశ్ జవదేకర్ ఇలా బడా నేతలంతా గ్రేటర్ ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం విస్తృత ప్రచారం నిర్వహించారు.

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీకి ధీటుగా ప్రచారాన్ని నిర్వహించి నిత్యం పతాక శీర్షికల్లో నిలిచాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఎక్కడా తమ ఉనికిని చాటుచోలేకపోయారు. ఆ పార్టీల అధినేతలు ప్రచారంలో కనిపించిన దాఖలాలు లేవు. తాజా బీహర్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అనూహ్యమైన ఫలితాలను సాధించారు. సీపీఐ, సీపీఎం పార్టీల కంటే కూడా సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. బీజేపీ మత ప్రాతిపధిక విధానాలకు కమ్యూనిస్టుల సెక్యులర్ రాజకీయాలే సరైన సమాధానం చెప్పగలవనే వాదన బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలు తమ ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో బీహార్ ఫలితాలు కొత్త ఆశకు ప్రాణం పోశాయి. కానీ… గ్రేటర్ ఎన్నికల్లో అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించలేదు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం బీజేపీ, ఎంఐఎం పార్టీలు దూకుడును సైద్ధాంతికంగా ఎదుర్కోగల సత్తా ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలే. మత రాజకీయాలకు ప్రతిగా సెక్యులర్ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లగల పార్టీలు అవే. అదే సమయంలో నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిందీ కమ్యూనిస్టులే. ఈ సానుకూల అంశాలను కమ్యూనిస్టులు గ్రేటర్ ఎన్నికల్లో వాడుకోలేకపోయారనే విమర్శలున్నాయి. కానీ నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లబాయ్ పటేల్ దంటూ, దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి విశేషమైందంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది.

నిజానికి ఒకప్పుడు పాతనగరంలో ఎంఐఎంకి గట్టి పోటీ ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీనే. సీపీఎం నేత మధు పాత నగరం సమస్యలపై చాలా సీరియస్ గా పనిచేశారు. దాడులనూ ఎదుర్కొన్నారు. కానీ… క్రమంగా కమ్యూనిస్టులు ప్రజల్లో తమకున్న కొద్దిపాటి పట్టునుకూడా కోల్పోతూ వచ్చాయి. ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రంగా పోటీచేశాయే తప్ప ఎక్కడా తమ పూర్తిశక్తులను వినియోగించలేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి 29 స్థానాల్లో పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోగలరనిపించడం లేదు.