iDreamPost
iDreamPost
మొన్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీవారు బస్సుల్లో ఇతర ప్రాంతాల వారిని తరలించి దొంగ ఓట్లు వేయించారని ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేసింది.. ఆందోళనలు, ధర్నాలంటూ రచ్చ చేసింది..
నిన్నటికి నిన్న బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేకపోవడంతో బీజేపీ ఆ పాత్ర పోషించింది. బయట వారిని పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని గగ్గోలు పెట్టింది. తీరా చూస్తే తిరుపతిలో సుమారు 2.80 లక్షలు, బద్వేలులో 90 వేలకుపైగా బంపర్ మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిచింది. ఓటమిపాలయ్యే పరిస్థితి ఉండి.. దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత భారీ మెజారిటీ సాధ్యం అవుతుందా?.. ఇక్కడే టీడీపీ, బీజేపీల ఆరోపణలు కట్టుకథలని.. పరాభవం ఖాయమని తెలిసి గందరగోళం సృష్టించే కుట్రలని ఆ మెజారిటీ అంకెలు స్పష్టం చేశాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలోనూ టీడీపీ అదే కుట్రకు, ఆరోపణలకు తెగబడింది. ఓటర్ల మద్దతు సాధించడంలో తన వైఫల్యాన్ని.. ప్రత్యర్థి గెలుస్తున్నాడన్న ఉక్రోషాన్ని ఇలా దొంగ ఓట్ల దొంగాటలతో బయటపెట్టుకుంటోంది.
కానీ ఎన్నాళ్లు ఇలా.. ఎన్నికలు జరిగినప్పుడల్లా వీలున్న చోట్ల తానే దొంగ ఓట్లు వేయడం.. వీలు లేనిచోట్ల, ప్రత్యర్థి గెలవడం ఖాయమని తేలిన చోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రచారం చేయడం.. ఉత్తుత్తి ఫిర్యాదులు, ధర్నాలు వంటి దుష్ట పన్నాగాలకు ముగింపు లేదా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీతో సహా ఏ ఒక్క పార్టీని అటువంటి కుట్రలు చేసి గందరగోళం సృష్టించకుండా కళ్లెం వేయలేరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?
ఓటరు ఐడీ.. ఆధార్ అనుసంధానమే మార్గం
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే వారికి, దొంగ ఓట్ల పేరుతో నాటకాలు ఆడేవారికి చెక్ పెట్టడానికే భారత ఎన్నికల సంఘం ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దీన్ని చేర్చి కేంద్ర న్యాయశాఖకు పంపింది. ఆధార్ అనుసంధానం వల్ల పోలింగ్ సమయాల్లో తలనొప్పిగా మారిన దొంగ ఓట్ల బెడదను అరికట్ట వచ్చని.. అసలు అటువంటి ఆరోపణలు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చేయవచ్చని పేర్కొంది. అలాగే లక్షలాది వలస జీవులు ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్లనవసరం లేకుండా ఉన్న ప్రాంతంలోనే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించవచ్చని సూచించింది. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది.
మరి ఎందుకు జాప్యం?
కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి చట్టం చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం చేయాలంటే 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయన్న సాకుతో కేంద్ర న్యాయశాఖ పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోంది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ఫోన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, పీఎఫ్ అకౌంట్, రేషన్.. ఇలా ప్రతిదానికీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేశారు. వాటికి లేని అభ్యంతరం, చోరీ భయం ఓటర్ కార్డుతో అనుసంధానానికే ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు నకిలీ ఆధార్ కార్డులు కూడా వస్తున్నాయన్న బూచిని చూపించి నిర్ణయం వాయిదా వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆధార్-ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియలో జాప్యానికి రాజకీయ నిర్ణయాల్లో లోపమే కారణమన్న వాదన వినిపిస్తోంది.
Also Read : Chandrababu, Fake Votes Allegations – కుప్పంలో తిరుపతి సీన్ రిపీట్