iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజనకు చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఉన్నతాధికారుల నివేదిక సిద్ధమవుతోంది. అది ప్రభుత్వానికి అందించగానే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అనంతరం అసెంబ్లీ ఆమోదానికి ప్రవేశపెడతారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులను ఖాయం చేసిన తర్వాత అధికారుల కేటాయింపు జరుగుతుంది. ఇదంతా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి కార్యరూపం దాల్చే దిశలో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు, జిల్లాల విభజనకు మధ్య ముడి పెడుతూ పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం అపాయింట్ మెంట్ డే ని అదే ఏడాది జూన్ 2గా నిర్ణయించారు. దానికి మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరుసటి రోజు అంటే మార్చి 2న, 2014న గెజిట్ ప్రచురణ వచ్చింది. విభజన చట్టం వచ్చిన తర్వాత, విభజన తేదీ నిర్ణయం అయిన తర్వాత, ఏప్రిల్ 30, మే 7న రెండు విడతలుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన తేదీ నిర్ణయించిన అనంతరం జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వెలువడ్డాయి. విభజనకు ముందే వచ్చిన ఫలితాల ఆధారంగా 2014 జూన్ 8న ఏపీలో తొలి ప్రభుత్వం ఏర్పాటయ్యింది.
ఈ విధానం ప్రకారం చూస్తే జిల్లాల విభజనకు చట్ట ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పవచ్చు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కాలేదని, కాబట్టి అది మనుగడలో ఉండగా జిల్లాల విభజన సాధ్యం కాదనే వాదన హాస్యాస్పదంగా కనిపిస్తోంది. జిల్లాల విభజన కు విపక్షంలో ఉన్న సమయంలోనే జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్ లోనే చెప్పారు. దానిని బట్టి ప్రక్రియ సాగుతున్నట్టు భావించాలి. చివరకు క్యాబినెట్ ఆమోదంతోనే కమిటీ ఆధ్యర్యంలో పలు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి అడ్డంకులు ఉండవని 2014 నాటి సాధారణ ఎన్నికలు చాటుతున్న పాఠం.
కాబట్టి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి వారి అభ్యంతరాలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని స్పష్టమవుతోంది. అదే సమయంలో జిల్లాల విభజన అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణ అందరికీ ఉపయోగకరం అనే వాదన కూడా ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపిక సహా అనేక అంశాలకు అది మార్గసుగమం చేస్తుందని భావిస్తున్నారు. దాంతో స్థానిక ఎన్నికల నిర్వహణ నిలిపివేసి, జిల్లాల విభజనకు అనుగుణంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం అనే సూచన రాజ్యాంగ నిపుణుల నుంచి కూడా వినిపిస్తోంది. విభజన పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.