iDreamPost
iDreamPost
రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న మత్స్యకార సామాజికవర్గానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మత్స్యకార భరోసా, రూ. 10 లక్షల పరిహారం, డీజిల్ సబ్సిడీ, పక్కా ఇళ్లు, ఫిష్ ఔట్ లెట్లు, హార్బర్లు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా మత్స్యకారులకు ఏదో అన్యాయం జరిగిపోతోందని జనసేన గగ్గోలు పెడుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 217 ద్వారా గంగపుత్రుల పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తూ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో అభ్యున్నతి పాదయాత్ర పేరుతో హడావుడి చేస్తున్నారు. ఈ నెల 20న నరసాపురంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. జనసేన చర్యలను మత్స్యకారులే తప్పుపడుతున్నారు. మత్స్యకారుల ఉపాధి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఒకవైపు అవహేళన చేస్తూ మరోవైపు ఏమీ చేయడంలేదని యాత్రలు చేయడం ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నిస్తున్నారు.
స్థిర ఉపాధికి జీవో 217
ప్రస్తుతం ఉన్న విధానం వల్ల రాష్ట్రంలో చేపల చెరువులు పెట్టుబడిదారులు, దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. సంప్రదాయ మత్స్యకారులు వారిపై ఆధారపడి పనిచేయాల్సి వస్తోంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసి చేపల చెరువులను వేలం పద్ధతిలో మత్స్యకార సహకార సంఘాలకు అప్పగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జీవో 217 జారీ చేసింది. దీనివల్ల మత్స్యకారులే చేపల చెరువులను నిర్వహించుకుంటూ స్థిర ఉపాధి పొందే వెసులుబాటు కలుగుతుంది. కానీ టీడీపీ దీన్ని వక్రీకరించి గంగపుత్రులకు అన్యాయం జరిగిపోతోందని విషప్రచారం చేస్తోంది. టీడీపీకి అజ్ఞాత మిత్రపక్షమైన జనసేన టీడీపీ అజెండాను అమలు చేస్తూ పాదయాత్ర పేరుతో హడావుడి చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు చంద్రబాబు ఏమీ చేయకపోయినా కిమ్మనని జనసేన మత్స్యకారులకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్లు మాట్లాడుతున్న జనసేన నేతలు గతంలో చంద్రబాబు ఆ సామాజికవర్గాన్ని అన్నివిధాలా మోసం చేసినా ఏనాడు ప్రశ్నించలేదు. వేట నిషేధ పరిహారం రూ.4 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరుతో ఏటా ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు అందిస్తోంది. వేట సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇస్తోంది. పక్కా ఇళ్లు, ఇతర నవరత్న పథకాలతోపాటు మత్స్యకారుల సౌలభ్యం కోసమే రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. అంతేకాకుండా మత్స్యకార మహిళల ఉపాధి కోసం ఫిషింగ్ ప్లేట్ ఫారాలు, రిటైల్ ఫిష్ ఔట్లెట్లు, ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ఔట్లెట్లు ఏర్పాటు చేస్తోంది. గతంలో గంగపుత్రులను అవమానించిన చరిత్ర ఉన్న చంద్రబాబు పార్టీతోపాటు జనసేన నాయకులు ప్రభుత్వం చేపల వ్యాపారం చేయడం ఏమిటని అవహేళన చేశారు. ఇప్పుడు అదే జనసేన నేతలు గంగపుత్రులపై ప్రేమ ఒలకబోస్తూ, కొంగజపం చేస్తూ యాత్రలు, సభల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్నారు.
Also Read : సోము వీర్రాజు ఏమ్ అనుకోలేదు.. అన్నీ అలా కుదురుతున్నాయ్ అంతే..!