మేయర్ పీఠానికి సమీప దూరంలో కారుకు బ్రేకులు పడ్డాయి. గ్రేటర్ ఫలితాలు అధికార పార్టీకి సంకట స్థితిని తెచ్చిపెట్టాయి. సెంచరీ కొడదామనుకున్న గులాబీ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మ్యాజిక్ ఫిజర్ చేరుకోలేక పోయిన టీఆర్ఎస్ 55 సీట్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అనూహ్య విజయంతో అధికార పార్టీ నుంచి దాదాపు సగం సీట్లను కొల్లగొట్టిన బీజేపీ రెండో స్థానానికి చేరుకుంది. మెజార్టీ సీట్లను సొంతం చేసుకున్నప్పటికీ టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని స్థితికి నెట్టబడింది. కాషాయ పార్టీ దూకుడుతో గ్రేటర్ లో హంగ్ అనివార్యమైంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55 సీట్లను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ప్రత్యర్థి పార్టీల మద్దతు కోరక తప్పేలా లేదు. ఎంఐఎంతో అధికార పార్టీకి స్నేహబంధమున్నప్పటికీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఒంటిరిగా పోటీ చేయడానికే మొగ్గు చూపింది టీఆర్ఎస్. 150 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. 100 స్థానాల్లో గెలుపును సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంది. టీఆర్ఎస్ అంచనాలు తారుమారవ్వడంతో ఇప్పుడు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గాలపై దృష్టి సారించింది.
కీలకంగా మారిన ఎక్స్ అఫిషియో
గ్రేటర్ ఫలితాల్లో ఏ పార్టీ సరిపడా మెజార్టీ రాకపోవడంతో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారాయి. గ్రేటర్ లో మొత్తం 52 మంది ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్‌కు 35, ఎంఐఎంకు 10, బీజేపీకి 03, కాంగ్రెస్ కి 01 ఉన్నాయి. తాజాగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీతో కలిపి టీఆర్ఎస్ ఓట్ల సంఖ్య 38కి చేరుతుంది. మెత్తం వార్డులకు ఎక్స్ అఫిషియో ఓట్లను జోడిస్తే 101 మ్యాజిక్ ఫిగర్ దాటితే తప్ప మేయర్ పీఠం దక్కే అవకాశం లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ గెలుచుకున్న 55 స్థానాలకు 38 ఎక్స్ అఫిషియో ఓట్లను కలిపినా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అనివార్యంగా మరో పార్టీ మద్దతు కోరక తప్పదు. టీఆర్ఎస్ కు ప్రత్యా్మ్నాయంగా భావిస్తున్నందున బీజేపీ అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాదు. ఇక మిగిలింది ఎంఐఎం మాత్రమే.
మజ్లిస్ మద్దతు
గ్రేటర్ ఫలితాల్లో 43 స్థానాల్లో పట్టును నిలబెట్టుకున్న మజ్లిస్ పార్టీ మద్దతు కోరడం ద్వారా టీఆర్ఎస్ సునాయాసంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగలుతుంది. కాంగ్రెస్ హయాంలోనూ ఎంఐఎం కీలకంగా వ్యవహరించింది. రెండున్నర సంవత్సరాలు మేయర్ పీఠాన్ని కూడా అనుభవించింది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిని ఎరగా వేసే టీఆర్ఎస్ మజ్లిస్ మద్దతు కోరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ… తమకు ఎవరితోనూ పొత్తులేదని, ఎవరి మద్దతు లేకుండానే మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామన్న టీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చి ఎంఐఎం మద్దతును కోరుతుందా అనేది ప్రశ్న.
కమలానికి కోత
ఎంఐఎం మద్దతు కోరకుండానే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్ ముందున్న మార్గం తన బలాన్ని పెంచుకోవడమే. ఆ బలాన్ని ఎలా పెంచుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఫలితాలపై స్పందించిన కేటీఆర్ రెండు నెలల సమయముందిగా…. మేమే సింగిల్ మెజార్టీ పార్టీగా ఉన్నామని మాట్లాడడం వెనక ఆంతర్యమేమై ఉంటుంది? బీజేపీ సభ్యులను తమలో కలుపుకోవడం ద్వారా టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలనుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా… ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఆ ప్రమాదాన్ని గుర్తించారు కూడా. తమ సభ్యులెవరూ టీఆర్ఎస్ లో చేరరంటూ కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కానీ ఆచరణలో టీఆర్ఎస్ పంథం నెగ్గుతుందో… బీజేపీ బలం నెగ్గుతుందో చెప్పలేం. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమలో కలుపుకున్న అనుభవం అధికార పార్టీకి ఎలాగూ ఉంది. అదే వ్యూహాన్ని ఇప్పుడూ అనుసరించే అవకాశముందంటున్నారు కొందరు.
మ్యాజిక్ ఫిగర్ నే మార్చేస్తే?
నేరుగా ఏ పార్టీ మద్దతు కోరకుండానే, ఇతర పార్టీ సభ్యులను తమవైపు మలుపుకోకుండానే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశమూ లేకపోలేదు. టీఆర్ఎస్ తో అనధికార స్నేహం నెరుపుతున్న ఎంఐఎం పరోక్ష సహకారం అధికార పార్టీని మేయర్ పీఠం వైపు నడిపించగలదంటున్నారు విశ్లేషకులు. బల నిరూపణను బహిష్కరించడానికి మజ్లిస్ పార్టీ సిద్ధమైతే టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చాటుకోగలుగుతుంది. 44 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం బల నిరూపణకు దూరంగా ఉంటే మిగిలిన సభ్యుల సంఖ్య 106గా ఉంటుంది. ఆ మొత్తంలో మ్యాజిక్ ఫిగర్ 53 అవుతుంది. టీఆర్ఎస్ 55 స్థానాలు గెలుచుకొన్నందున సునాయాసంగా మెజార్టీని నిరూపించుకోగలదు. తద్వారా మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకోగలదు. పై రెండింటికంటే ఈ మార్గం టీఆర్ఎస్ ప్రతిష్టకు ఏ రకంగానూ భంగంకలిగించనిది. మరి టీఆర్ఎస్ పార్టీ తనముందున్న మూడు మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి.