iDreamPost
android-app
ios-app

జూనియర్ చేయబోయేది ఎలాంటి షో

  • Published Dec 12, 2020 | 5:44 AM Updated Updated Dec 12, 2020 | 5:44 AM
జూనియర్ చేయబోయేది ఎలాంటి షో

మూడేళ్ళ క్రితం బిగ్ బాస్ సీజన్ 1ని తన అద్భుతమైన యాంకరింగ్ తో నిలబెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్ళీ ఏ రియాలిటీ షో చేయలేదు. భారీ ఆఫర్లు వచ్చినా సరే పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టాడు. తాజాగా జెమినీ ఛానల్ యంగ్ టైగర్ తో మరో గేమ్ షో ప్లాన్ చేయబోతోందన్న టాక్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు ఒప్పందం జరిగిపోయిందని త్వరలో ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే తను చేయబోయే ఆట ఎలా ఉంటుందన్న క్లూ మాత్రం లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు టైపులో భారీ ప్రైజ్ మనీని ఆఫర్ చేసేదన్న మాట వాస్తవమే.

గత కొంత కాలంగా జెమినీ ఛానల్ కొత్త సినిమాల విషయంలో తప్ప మిగిలినవాటిలో కొంత వెనుకబడి ఉంది. అటు సీరియల్స్ లో కార్తీక దీపం, ఇటు రియాలిటీ షోలతో బిగ్ బాస్ లాంటివి స్టార్ మా ఖాతాలోనే ఉన్నాయి. దానికి తోడు డాన్సీ లాంటి వెరైటీ ప్రోగ్రాములు కూడా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఈటీవీ సైతం జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో బాగానే రేటింగ్స్ దక్కించుకుంటోంది. ఇందులో రేస్ లో వెనుక ఉన్నామని గుర్తించిన జెమినీ భారీ బడ్జెట్ తో కనివిని ఎరుగని రీతిలో ఇప్పుడీ షోని ప్లాన్ చేయబోతున్నట్టుగా టీవీ వర్గాల సమాచారం. అది ఏ టైపు లో ఉంటుందన్న లీకులు మాత్రం ఇంకా బయటికి రాలేదు.

ప్రత్యేకంగా దీని కోసమే అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు ఫ్లోర్లలో ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారని ఇన్స్ సైడ్ టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ కు మధ్యమధ్యలో కావాల్సినంత టైం దొరుకుతోంది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా సమస్య ఉండదు. గతంలో ఇంత కన్నా టైట్ షెడ్యూల్ లోనే బిగ్ బాస్ వన్ చేశాడు. కాబట్టి అదేమీ ప్రాబ్లమ్ కాదు. బుల్లితెరపై ఇప్పటిదాకా రాని ఒక వెరైటీ గేమ్ షో మాత్రం చూడబోతున్నారన్నది వాస్తవం. పాల్గొనేవాళ్లకు ప్రైజ్ మనీ కూడా కనీసం కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని వినికిడి. మరికొన్ని వివరాలకు ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.