iDreamPost
android-app
ios-app

KCR ,AP Power -ఏపీలో కరెంటు లేదా, కేసీఆర్ మాటల వెనుక మర్మమదే..

  • Published Oct 26, 2021 | 2:02 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
KCR ,AP Power -ఏపీలో కరెంటు లేదా, కేసీఆర్ మాటల వెనుక మర్మమదే..

ఏపీలో కరెంటు లేదు.. తెలంగాణాలో 24గంటల విద్యుత్ ఇస్తున్నాం, ఇదీ కేసీఆర్ మాట. తెలంగాణా వాసులకు నిజమేనేమో అనిపిస్తుంది గానీ ఏపీలో మాత్రం ఎవరూ ఈ మాటను నమ్మలేరు. ఎందుకంటే ఏపీలో కూడా విద్యుత్ సమస్య కనిపించడం లేదు. ఓ వర్గం మీడియాలోనూ, ప్రతిపక్ష ప్రచారంలో తప్ప కరెంటు కోతల ఊసేలేదు. ప్రపంచమంతా పెద్ద సంక్షోభం తలెత్తినా ఏపీ మాత్రం విద్యుత్ సంక్షోభం రాకుండా గట్టెక్కేయత్నంలో ఉంది. తెలంగాణాకి సొంతంగా సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఏపీకి ఎటువంటి అవకాశం లేకపోయినా విద్యుత్ ఉత్పాదన, సరఫరాలో సమస్యలు రాకుండా చూస్తోంది. తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడంలో జగన్ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అయినా గానీ కేసీఆర్ మాత్రం ఏపీతో పోల్చి చెప్పడం, అందులోనూ విద్యుత్ సమస్యను ప్రస్తావించడం విశేషంగా భావించాలి.

వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం నినాదంతో ప్రారంభమయిన టీఆరెఎస్ ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యాన్ని పురష్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ ఈ మాటలన్నారు. అదే సమయంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రయోజనాలను కూడా ఆయన ఆశిస్తారనడంలో సందేహం లేదు. దానికి అనుగుణంగా తెలంగాణా సెంటిమెంట్ ని ఆయన ఉపయోగించుకోవాలనుకోవడం కూడా విడ్డూరం కాదు. రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అనే ఇమేజ్ ని కొనసాగించాలంటే ఏపీ మీద ఏదోటి మాట్లాడితేనే కేసీఆర్ కి ఉపయోగపడుతుంది. అందుకే తాము విద్యుత్ అందిస్తుంటే ఏపీ చీకట్లో ఉందనే రీతిలో కేసీఆర్ మాట్లాడడం ద్వారా సగటు తెలంగాణా వాసులను రంజింపజేయవచ్చని ఆయన భావించవచ్చు. నిజంగానే ఏపీ కి కరెంటు కోతలున్నాయని జనం నమ్మితే తెలంగాణాలో కరెంటు సరఫరా కూడా కేసీఆర్ ఘనతేనని అనుకోవచ్చు. కేసీఆర్ కి కావాల్సిందే అది. అందుకే ఆయన ప్రత్యేకంగా విద్యుత్ అంశాన్ని ప్రస్తావించారు.

Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?

వాస్తవ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. విద్యుత్ ఉత్పాదనలో ఏపీ ముందంజలో ఉంది. హైడల్ పవర్ మినహా థర్మల్, సోలార్, విండ్ పవర్ సహా అన్నింటా ఏపీదే ఆధిక్యం. మొత్తం ఏపీ జెన్కో కూడా టీఎస్ జెన్కో తో పోలిస్తే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీ లో 18,668 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అదే సమయంలో తెలంగాణాలో 16,614 యూనిట్లు ఉత్పత్తి సాధించారు. ఏపీ జెన్కో ద్వారా మొత్తం అవసరాల్లో 46 శాతం విద్యుత్ లభిస్తుండగా తెలంగాణాలో మాత్రం 66 శాతం బయటి నుంచి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఆర్థికంగా అవకాశాలుండడంతో తెలంగాణా ప్రభుత్వం అదనంగా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా లో సమస్య రాకుండా చేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా అధిక ధరకు కూడా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ సంక్షోభం ముసరకుండా జాగ్రత్తపడింది.

రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను పట్టుకుని ఏపీలో విపక్షాల నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. రెండు వారాల క్రితం ఏపీలో చీకట్లు, అంధకారం అంటూ అడ్డగోలుగా మాట్లాడిన నేతలకు ఇప్పుడు ఏపీలో వెలుగులు ప్రవహిస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. విద్యుత్ కష్టాలు వస్తాయని ఆశించిన వారికి ఇదో పెద్ద ఆశాభంగంగా చెప్పవచ్చు. విద్యుత్ సమస్య తీర్చడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించడం మింగుడుపడకపోవచ్చు. కానీ తెలంగాణా రాజకీయాల కోసం చేసిన వ్యాఖ్యలను ఏపీలోని వినిపించాలని చూస్తే ఆయా పార్టీల నేతలను చూసి ప్రజలు నవ్వుకోవడం మినహా మరో అవకాశం కూడా లేదనే చెప్పాలి.

Also Read : Assembly Seats Hike – 2023 లోపే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందా..?