iDreamPost
android-app
ios-app

Chandrababu Political Values – బాబు నోట.. విలువల మాట

  • Published Oct 22, 2021 | 7:36 AM Updated Updated Oct 22, 2021 | 7:36 AM
Chandrababu Political Values – బాబు నోట.. విలువల మాట

తెలుగుదేశం విలువలతో కూడిన రాజకీయాలు చేసే పార్టీ అని దాని అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై జనం, రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. తన 36 గంటల దీక్ష సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం వింటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. రెప్ప వేయకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతారని, నిజం చెబితే తల వేయి వక్కలవుతుందని ఆయనకు శాపం ఉందని వైఎస్సార్‌ తరచుగా అంటుండేవారు. వర్తమాన రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసినా ఎవరికీ తన గతం గురించి తెలియదన్నట్లు పచ్చి అవాస్తవాలు మాట్లాడుతూ చంద్రబాబు తన వాక్చాతుర్యాన్ని ప్రదరిస్తుంటారు.

అసలు విలువలు పాటించిందెప్పుడు?

కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, తీరా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్‌పార్టీని వీడి టీడీపీలో చేరడం విలువల రాజకీయమా? ఆ పార్టీలో చేరినది లగాయితు పదవుల కోసం పాకులాడుతూ పార్టీలో గ్రూపు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారడమూ విలువైన పనేనా? తనకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి సీఎంగా పదవీచ్యుతుడిని చేయడమూ విలువల రాజకీయమేనా? తెలుగుదేశం పార్టీని కబ్జా చేయడమే కాక ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడి సమకూర్చిన పార్టీ ఫండ్‌ను సైతం ఆయనకు దక్కకుండా చేయడానికి కోర్టుకు వెళ్లి ఆయన్ని క్షోభకు గురి చేయడాన్ని ఏమంటారో?

అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడి మృతికి కారణమైన రాజకీయ చర్యలన్నీ కూడా విలువలతో కూడినవేనా? ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపే సమయంలో తనకు సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి, బావమరిది హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పి ఇద్దరినీ పార్టీ నుంచే బయటకు సాగనంపేయడం కూడా విలువైన పనేనా? 2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీ ప్రచారానికి వాడుకొని, తర్వాత తన కుమారుడు లోకేశ్‌ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి అవుతాడనే దురుద్దేశంలో కరివేపాకులా పక్కన పెట్టడాన్ని ఏమనాలో?

పార్టీ కార్యాలయం దేవాలయమైతే ప్రజలెన్నుకున్న సీఎం ఏమవుతారు?

ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని, 70 లక్షల మంది కార్యకర్తలకు అది దేవాలయమని చంద్రబాబు చెబుతున్నారు. అలాంటప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులు అఖండ మెజార్టీతో ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమనాలి? అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని తమ పార్టీ నేత నోటికొచ్చినట్టు బూతులు తిడితే ఖండించి, అదుపులో పెట్టాల్సింది పోయి వెనకేసుకురావడం కూడా విలువలతో కూడిన రాజకీయమా? ముఖ్యమంత్రిని వాడు, వీడు అని సంబోధిస్తూ జనంలో పలుచన చేయాలని చూడడం ఏ తరహా రాజకీయమో? టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం ‍ప్రజాస్వామ్యంపైన, కార్యకర్తల మనోభావాలపైన దాడి చేయడం అని సూత్రీకరిస్తున్న చంద్రబాబు.. మరి జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన తల్లిపై నీచాతినీచమైన బూతులతో దాడి చేయడం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, ప్రజల మనోభావాలపై దాడి చేయడం అని ఎందుకు గుర్తించరు.

వినేవాళ్లు ఉన్నారు కదాని..

టీడీపీనీ అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బాబు అసలు ఆ అవకాశం ఇతరులకు ఇస్తారా? జెడ్పీ నుంచి పంచాయతీ వరకు వరుస ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న ఆయన నాయకత్వంలోని పార్టీని వేరొకరు అంతమొందించడమెందుకు. అది ఇప్పటికే ఆ దిశలో పయనిస్తోంది. చేతగాకపోతే పోలీసు వ్యవస్థను మూసేయండి అని చెబుతున్న చంద్రబాబుకు పోలీసుల సామర్థ్యంపై నమ్మకం లేకపోతే తనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వెనక్కి పంపేయొచ్చుగా. వారి రక్షణ లేకుండా బయటకు వస్తే ఈయన గారికి జనంలో ఉన్న విలువ ఏమిటో తెలిసివస్తుంది. తన మాటలకు చప్పట్లు కొట్టే కార్యకర్తలు, తాను ఏం మాట్లాడినా హైలైట్‌ చేసే మీడియా ఉంది కదా అని ఇలా విలువలపై చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తే జనం ఆశ్చర్యపోక ఏం చేస్తారు!