iDreamPost
android-app
ios-app

రేపు స‌మావేశం : జ‌ల జ‌గ‌డంపై బీజేపీ స్టాండ్ ఏంటి?

రేపు స‌మావేశం : జ‌ల జ‌గ‌డంపై బీజేపీ స్టాండ్ ఏంటి?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. మంత్రుల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. దీంతో పాటు తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌, ఆంధ్రాలో రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌పై తీవ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రేపు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ‌కు చెందిన బీజేపీ శాఖ‌లు స‌మావేశం కావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. జ‌ల వివాదాలు ముదురుతున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం పాత్ర చాలా కీల‌కం. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు కూడా జ‌ల జ‌గ‌డాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ఉంది. ఈ క్ర‌మంలో రేపు జ‌ర‌గ‌బోయే స‌మావేశంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల స్పంద‌న‌ ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్ లేఖ‌పై చ‌ర్చ

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్ప‌టికే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సర్కార్‌ అక్రమంగా వినియోగించిన నీటిని ఆ రాష్ట్ర కోటా కింద పరిగణించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ఇవే అంశాలను వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా లేఖ రాశారు.

‘‘జల విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకోవద్దని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌), ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా, అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇది అంతరాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తోంది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులకు విఘాతం కల్పిస్తోంది. తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగక తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది’’ అని జ‌గ‌న్ తన లేఖ‌లో పేర్కొన్నారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్రం త‌గిన విధంగా స్పందించ లేదు.

బీజేపీ నేత‌లు ఏం ప్ర‌తిపాదించ‌నున్నారు

ఇటువంటి స‌మ‌యంలో చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ. రేపు కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మరోవైపు.. అదే రోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు సమస్యలతో పాటు కృష్ణా జలాలు, నిరుద్యోగ సమస్య, హుజురాబాద్‌ ఉప ఎన్నికపై చర్చించనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దీంతో.. రెండు రాష్ట్రాల బీజేపీ సమితిలు.. జల వివాదం, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.