Idream media
Idream media
NTR, SVR ఇద్దరూ మహానటులు. వాళ్లు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఒకర్నొకరు తినేస్తారు. ఒకర్ని మించి ఇంకొకరు కనిపిస్తారు. వాళ్లతో పాటు అదే సీన్‌లో సావిత్రి, కన్నాంబ , సూర్యకాంతం కూడా ఉంటే? అది ఆత్మబంధువు (1962) సినిమా అవుతుంది.
1953లో ఆశాపూర్ణదేవి జోగ్‌బి జోగ్ అనే నవల రాశారు. దాన్ని బెంగాలీలో సినిమా తీస్తే హిట్. దాన్నే శివాజి గణేషన్ , SVRలతో తమిళంలో పడిక్కాద మేదయ్ (1960) అని తీస్తే హిట్. భీమ్‌సింగ్ డైరెక్ట్ చేశారు. విజయ్‌చందర్ కరుణామయుడు సినిమాకి ఈయనే డైరెక్టర్. తెలుగులో NTRతో సారథి స్టూడియోస్ వారు ఆత్మబంధువు తీస్తే సూపర్‌హిట్. ఇక్కడ డైరెక్టర్ రామకృష్ణ (భానుమతి భర్త).
అయితే ఇదేం గొప్ప కథ కాదు. ఒక జమీందారు , ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఒక అనాథని చేరదీసి పెంచితే అతను ఆ ఇంట్లోనే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో జమీందారు ఆస్తి పోతుంది. సహజంగానే పిల్లలు నిరాదరణతో వ్యవహరిస్తారు. ఆయన పెంచిన వాడు అండదండగా నిలుస్తాడు.
జమీందారు SVR, అనాథ NTR, కావాల్సినన్నిఎమోషనల్ సీన్స్. రిలేషన్స్‌కి పెద్దగా విలువ లేని ఈ కాలంలో కూడా కళ్లు చెమరిస్తే , 58 ఏళ్ల క్రితం ప్రేక్షకుల పరిస్థితి ఊహించుకోవచ్చు. నిజానికి తమిళ వెర్షన్‌లో పెద్దగా మార్పులు లేకుండా తీశారు. ఈ క్రెడిట్ అంతా భీమ్‌సింగ్‌దే. అయితే రామకృష్ణ మూలాన్ని చెడగొట్టకుండా ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు. తమిళంలో కూడా SVR, కన్నాంబలే Act చేశారు. సావిత్రి రోల్ షావుకారు జానకి వేశారు. నిజానికి సావిత్రి నటనకి పెద్దగా స్కోప్ లేదు. కేవలం భర్త చాటు భార్యగా మాత్రమే వుంటుంది.
దీన్నే కన్నడలో రాజ్‌కుమార్, జయంతిలతో తీస్తే ఆడలేదు. అక్కడ SVR రోల్ సంపత్ చేశాడు. ఎందుకో ఆ క్యారెక్టర్ పండలేదు.
NTRని ఇంట్లో నుంచి వెళ్లిపోమనే సీన్‌లో SVR నటన అద్భుతం. కోపం, బాధ, నిస్సహాయత అన్నీ Expressions ఏక కాలంలో చూపిస్తాడు. పాటలన్నీ హిట్. అనగనగా ఒక రోజు, చదువురాని వాడవని పాటలు సూపర్‌హిట్.
రాజబాబు , శారదలు చిన్న వేషాలు వేశారు. అప్పటికింకా వాళ్లకి పేరు రాలేదు. పద్మనాభం ఉన్నా పెద్ద కామెడీ లేదు. తర్వాతి రోజుల్లో పెద్ద నిర్మాతగా పేరుగాంచిన ఏడిద నాగేశ్వరరావు చిన్న వేషం వేశారు.
NTR కొన్ని సీన్స్‌లో అతి అనిపించినా , ఆ క్యారెక్టర్ డిజైన్ అలా చేశారు. అమాయకత్వం, మొండితనం, తనను పెంచిన SVRపైన విపరీతమైన ప్రేమ. ఇదే క్యారెక్టర్ సింహాద్రిలో జూనియర్ NTR చేశాడు. అయితే అమాయకత్వం బదులు ఆవేశం వుంటుంది.
డబ్బు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా మన చుట్టూ ఉన్న వాళ్ల ప్రవర్తనలు మారిపోతుంటాయి. ఈ జానర్‌లో కరెక్టర్‌గా తీస్తే సినిమా ఆల్‌టైమ్ హిట్.
తమాషా ఏమంటే శివాజిగణేషన్ తమిళంలో తీసిన దాన్ని తెలుగులో ఆత్మబంధువుగా తీస్తే , భారతీరాజా తీసిన ముతల్ మరియాదైని తెలుగులో ఆత్మబంధువుగా డబ్ చేశారు. హీరో శివాజిగణేషన్. రాధ హీరోయిన్.