iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డకు ఏమి మిగిలింది.. గవర్నర్ లేఖ దేనికి సంకేతం

  • Published Jul 22, 2020 | 12:26 PM Updated Updated Jul 22, 2020 | 12:26 PM
నిమ్మగడ్డకు ఏమి మిగిలింది.. గవర్నర్ లేఖ దేనికి సంకేతం

ఏపీ హైకోర్ట్ ఆదేశాల మేరకు గవర్నర్ ని కలిసి నిమ్మగడ రమేష్ కుమార్ కి ఉపశమనం దక్కినట్టేనా.. ఆయన్ని మళ్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా నియమించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారా.. లేక రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని పేర్కొన్నారా.. ఇవే ఇప్పుడు సామాన్యుడికి అంతుబట్టని అంశాలుగా మారాయి. గవర్నర్ కార్యదర్శి పేరుతో వెలువడిన లేఖ ఆధారంగా నిమ్మగడ్డను మళ్లీ నియమించాలనే ఆదేశాలు వచ్చినట్టు ఓ వర్గం మీడియా , విపక్ష టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ న్యాయపరంగా దానికి చాలా చిక్కులున్నట్టు కనిపిస్తోంది. తన లేఖలో ఎక్కడా పునర్నియామకం అనే అంశాన్ని ప్రస్తావించకుండా గవర్నర్ కేవలం తగిన చర్యలు అని మాత్రమే చెప్పడం ద్వారా బంతిని సీఎం కోర్టులోకి మళ్లించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్ట్ ఈ విషయాన్ని గవర్నర్ వైపు మళ్లించగా, ఇప్పుడు రాజ్ భవన్ నుంచి సీఎంవో కి వచ్చిందని చెప్పవచ్చు. తద్వారా నిమ్మగడ్డ భవితవ్యం మళ్లీ జగన్ నిర్ణయించాల్సిందేనని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సాగుతున్న తంతు ఆసక్తికరంగా మారుతోంది. అనేక మలుపులు తిరుగుతోంది. హైకోర్ట్, అక్కడి నుంచి సుప్రీంకోర్ట్, మళ్లీ హైకోర్ట్ నుంచి వారం క్రితం గవర్నర్ వరకూ వెళ్లింది తీరా ఇప్పుడు గవర్నర్ మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బదాలయించారు. ఇటీవల కోర్ట్ ధిక్కారణ కేసు విచారణలో హైకోర్ట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. తద్వారా సీఈవోగా నిమ్మగడ్డకు అవకాశం వచ్చినట్టేనని ఆయన అనుకూలురు చెబుతున్నారు.

అయితే న్యాయపరంగా పలు చిక్కులున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా ఎస్ఈసీ నియామకం చెల్లదని ఇప్పటికే హైకోర్ట్ చెప్పింది. జస్టిస్ కనగరాజ్ విషయంలో కోర్ట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. అప్పట్లో ఆర్డినెన్స్ కూడా కొట్టివేసింది. ఈ తరుణంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వ సిఫార్సుల మేరకు నాటి గవర్నర్ ద్వారా నియమితుడైన నిమ్మగడ్డ కి కూడా అర్హతలేనట్టేనని మరో వర్గం చెబుతోంది. కేవలం నిమ్మగడ్డ మాత్రమే కాకుండా ఇతర ఎస్ఈసీ లందరికీ ఇది వర్తించినట్టేనని చెబుతున్నారు. ఆర్టికల్ 241 కే ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ఎస్ఈసీ ని నియమిస్తారని హైకోర్ట్ ఉత్తర్వుల్లో ఉంది. దానిని బట్టి ఏపీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. అయినప్పటికీ గవర్నర్ తన పరిధిలోని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదాలయించడం ద్వారా బంతి మళ్లీ జగన్ చెంతకు చేర్చినట్టు చెబుతున్నారు.

గవర్నర్ కోర్ట్ ధిక్కారణ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆయన నిర్ణయాన్ని కోర్ట్ కూడా ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ఆదేశాలను హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారమే అమలు చేసే అధికారం ప్రభుత్వానికి లేక పోవడం, అయినప్పటికీ గవర్నర్ దానిని ఏపీ ప్రభుత్వానికి అప్పగించడంతో ఈ కథ లో ఎటువంటి మలుపులకు అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరికొంత కాలం కాలయాపన సాగుతుందనే చెప్ప ఏమీ సాధ్యం కాదంటున్నారు. గవర్నర్ ఆదేశాల అమలు కోస మళ్లీ నిమ్మగడ్డ కోర్టు మెట్లు ఎక్కినా తన ఆదేశాలకు భిన్నంగా హైకోర్ట్ తీర్పు వెలువరించే అవకాశం లేనుందున నిమ్మగడ్డ అనుకున్నదొకటి..అయ్యిందొకటి అన్న చందంగా తయారయ్యింది.