iDreamPost
android-app
ios-app

విడవనంటున్నాడు..!

  • Published Oct 19, 2020 | 6:38 AM Updated Updated Oct 19, 2020 | 6:38 AM
విడవనంటున్నాడు..!

ఉభయ తెలుగు రాష్ట్రాలను వానదేవుడు విడవనంటున్నాడు. ఒకదాని వెంట మరొకటి వాయుగుండాలు, అల్పపీడనాలతో హోరెత్తించేస్తున్నాడు. గత వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడే ముంపునీరు నిలిచిపోయింది. కొన్ని చోట్లయితే 5అడుగుల స్థాయికి భూగర్భ నీటిమట్టం కూడా చేరుకుందంటే వర్షం ఏ స్థాయిలో కురిసిందో అర్ధం చేసుకోవచ్చు. ఉభయ రాష్ట్రాల్లోనూ కొన్ని పట్టణాలు, నగరాల్లో యేడాది మొత్తం కురవాల్సిన వాన కేవలం ఒకటి రెండు రోజుల్లోనే నమోదైపోయింది. దీంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రైతుల పంట మొత్తం వాన నీటిలోనే చిక్కుకుంది. దిక్కుతోచని స్థితిలో రైతులు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టుగా వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదే ప్రాంతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు అనుబంధ ఉపరితల ఆవర్తన ద్రోణికూడా ఏర్పడిందంటున్నారు. దీనికి తోడు సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. వీటన్నిటినీ పరిశీలించిన మీదట రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడుతుందని, తద్వారా బుధవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. దీని ప్రభావం ఏపీ వైపే ఎక్కువగా ఉంటుందంటున్నారు.

వాతావరణ కేంద్రం నుంచి వెలువడిన హెచ్చరికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన మురుగునీటిని బైటకు పంపించేందుకు తలమునకలై ఉన్న యంత్రాంగం రానున్న వర్షాలకు కూడా సర్వసన్నద్ధమవుతున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ పంట చేలల్లో నిలిచిపోయిన నీటిని బైటకు పంపించేందుకు ఇప్పటికే పలు చోట్ల పుంతలు, రోడ్లకు గండ్లు కొట్టారు. మరో నాలుగు రోజలు పాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాటిని మరింత వెడల్పు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. విడవకుండా ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. మరో నాలుగు రోజులు వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టం తప్పదంటున్నారు.