Idream media
Idream media
క్రీ. శ. 1600 సంవత్సరంలో వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ మొదట్లో కొందరు ఇంగ్లీషు సైనికులు, మరికొంత మంది భారత సిపాయిలతో సైన్యం ఏర్పాటు చేసుకున్నా దానిని తమ గోడౌన్ల రక్షణ కోసం, ఆ తరువాత స్థానిక రాజుల మధ్య జరిగిన యుద్ధాలలో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి తరఫున పోరాడే కిరాయి సైన్యంగా వాడుతూ, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్ధౌలాను కుట్రతో ఓడించి, 1764లో జరిగిన బక్సర్ యుద్ధంలో మొఘల్, అవధ్, బెంగాల్ నవాబుల కూటమిని ఓడించి బెంగాల్ లో బ్రిటిష్ రాజ్యం ఏర్పాటు చేసింది.
పాలన కోసం గవర్నర్ పదవిని సృష్టించి మొదటి గవర్నరుగా అప్పటికే కంపెనీలో గుమస్తాగా చేరి అంచెలంచెలుగా ఎదిగిన వారెన్ హేస్టింగ్స్ ని నియమించింది కంపెనీ . గవర్నర్ హోదాతో పాటు బెంగాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యత కూడా హేస్టింగ్స్ మీద పడింది. కోర్టులో కేసుల విచారణ చేపట్టకపోయినా ఇతర న్యాయమూర్తుల నియామకం చేయవలసిన బాధ్యత గవర్నరుదే.
ఆ రోజుల్లో ఇంగ్లాండులో ఒక సగటు వ్యక్తి సంవత్సరానికి 17 పౌండ్లు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటే, భారత దేశంలో కంపెనీ ఉద్యోగులు సంవత్సరానికి ఎనిమిది వందల పౌండ్లు అవలీలగా సంపాదిస్తూ ఉండేవారు. ఇదంతా అవినీతి సొమ్ము అని వేరే చెప్పక్కర్లేదు.
అంతా అవినీతి మయం
కంపెనీలో వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఉన్న హేస్టింగ్స్ డబ్బు ఎలా సంపాదించాలో కూడా తెలుసుకున్నాడు. కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి, కంపెనీ తరపున కాంట్రాక్టులు ఇవ్వడానికి రేట్లు ఫిక్స్ చేశాడు. అయితే డబ్బు కలెక్షన్ మొత్తం హేస్టింగ్స్ సతీమణి మేరియన్ హేస్టింగ్స్ చూసుకునేది.
ఎవరైనా తన మీద అవినీతి ఆరోపణలు చేసి కోర్టుకెక్కితే కాపాడుకోవడానికి సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జీలు ఎలిజా ఇంపే, రాబర్ట్ ఛాంబర్స్ లకు లంచాలు ఇచ్చి వారిని తన కనుసన్నలలో పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నాడు వారెన్ హేస్టింగ్స్. అయితే బ్రిటిష్ రాజ్యం ఏర్పాటు చేయడానికి, దాన్ని క్రమ పద్ధతిలో నడిచేలా ఏర్పాట్లు చేయడానికి హేస్టింగ్స్ చేసిన కృషి వల్ల అతని మీద ఆరోపణలు లండన్ లోని ఈస్టిండియా కంపెనీ పెద్దలకు చేరినా వాళ్ళు అంతగా పట్టించుకోలేదు.
ముక్కసూటి జడ్జి జాన్ హైడ్
బెంగాల్ సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జి జాన్ హైడ్ ముక్కుసూటిగా పనిచేసే నిజాయితీ పరుడు. ఆంగ్లేయులకు, భారతీయులకు చట్టం ఒకేలాగా ఉండాలని నమ్మి అలాగే తీర్పులు కూడా ఇచ్చేవాడు. తన కోర్టులోని అవినీతి కంపు చూసి భరించలేక తాను ఇంగ్లాండుకి తిరిగి వెళ్ళాక పార్లమెంటులో ఫిర్యాదు చేయడానికి ఆధారాల సేకరణ కోసం కొర్టుకి వచ్చిన ప్రతి కేసు తాలూకు వివరాలు తెల్ల కాగితాల మీద రాసుకోవడం మొదలు పెట్టాడు. ఎవరైనా న్యాయమూర్తులు ఏదైనా కేసులో అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఆ వివరాలు కూడా నోట్ చేశాడు. కొన్నిసార్లు విచారణ సమయంలో లంచాలు తీసుకున్న న్యాయమూర్తులు తన పక్కనే కూర్చుని ఉన్న సమయంలో తాను రూపొందించుకున్న ప్రత్యేకమైన కోడ్ ఉపయోగించి నోట్స్ రాసుకున్నాడు జాన్ హైడ్.
22,000 పేజీలు ఉన్న ఈ నోట్సుని ప్రచురించాలన్న హైడ్ కోరిక తీరకుండానే మరణించాడు. అవినీతి జడ్జీల గురించి లండన్ పార్లమెంటులో ఫిర్యాదు చేయాలన్న కోరిక కూడా తీరలేదు. అయితే ఎలిజా ఇంపే మాత్రం బ్రిటన్ పార్లమెంటు అభిశంసనకు గురయ్యాడు. జాన్ హైడ్ నోట్స్ కొన్ని మాయం కాగా, మరికొన్ని శిధిలమై, మిగిలినవి అనేక చేతులు మారి కలకత్తాలోని నేషనల్ లైబ్రరీ చేరాయి. అక్కడ వీటిని మైక్రోఫిల్మ్ రూపంలో భధ్రపరిచారు. ఇవి ఒక కాపీ అమెరికన్ లైబ్రరీలో ఉన్నాయి. అక్కడ వీటిని డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో పెట్టారు.
పార్లమెంటు అభిశంసనకు గురయిన హేస్టింగ్స్
వారెన్ హేస్టింగ్స్ పది సంవత్సరాల సర్వీసు తరువాత 1785లో రాజీనామా చేశాడు. అయితే అప్పటికే కొందరు జడ్జీలతో కలిసి బెంగాల్ లో న్యాయవ్యవస్థను హేస్టింగ్స్ అవినీతి మయం చేయడం, ఇతరత్రా కుంభకోణాల సంగతి లండన్ పార్లమెంటుకు చేరింది. దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొందరు ఎంపీలు హేస్టింగ్స్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జాన్ బర్క్ అనే ఎంపీ అన్ని కేసులకు సంబంధించి ఆధారాలు సేకరించి అభిశంసన తీర్మానంలో వాదన మొదలుపెడితే, హేస్టింగ్స్ కుంభకోణాల చిట్టా చదవడానికే రెండు రోజులు పట్టింది.
ఏడు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత, భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం ఏర్పడడానికి హేస్టింగ్స్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డ్స్ క్షమించి, శిక్ష లేకుండా వదిలేసింది. సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ వల్ల డబ్బంతా పోగొట్టుకొని దివాలా తీశానని వేడుకుంటే ఈస్టిండియా కంపెనీ స్టైపెండ్ ఇచ్చింది. వారెన్ హేస్టింగ్స్ తో పాటు అనేక అవినీతి వ్యవహారాల్లో భాగస్వామి అయిన బెంగాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలీజా ఇంపే కూడా పార్లమెంటు అభిశంసనకు గురయ్యాడు.