iDreamPost
android-app
ios-app

బాక్సింగ్ బరిలో మెగా ‘గని’

  • Published Jan 19, 2021 | 5:59 AM Updated Updated Jan 19, 2021 | 5:59 AM
బాక్సింగ్ బరిలో మెగా ‘గని’

ఎఫ్2, గద్దలకొండ గణేష్ వరస విజయాల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ని గనిగా ఫిక్స్ చేశారు. గతంలో బాక్సర్ అనుకుని ఆ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత దాన్ని మారుస్తున్నట్టు ప్రకటించారు కానీ పేరు మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు గనిగా నామకరణం చేసి రామ్ చరణ్ ద్వారా మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇది మాత్రం ఊహించని టైటిలే. అయితే ఈ పేరుకి పవర్ స్టార్ కి ఒక కనెక్షన్ ఉంది. గతంలో వచ్చిన బాలు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఇది. ఈ రకంగా కూడా ఫ్యాన్స్ కి ఓ కనెక్షన్ ఏర్పడుతోంది.

ఈ రోజు విడుదల చేసిన లుక్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్ లో ఇచ్చిన స్టిల్ తప్ప ఇంకేదీ లేదు. స్టోరీ థీమ్ ఏంటో స్పష్టంగా చెప్పేశారు. అప్పుడెప్పుడో అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి తర్వాత హీరోలు బాక్సర్ లు గా నటించిన సినిమాలు పెద్దగా లేవు. మళ్ళీ ఇన్నాళ్లకు గని రూపంలో వస్తోంది. పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న లైగర్ కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ అన్నారు కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే ఇద్దరు యువహీరోలు మధ్య మంచి పోటీని చూడొచ్చు. గనిని వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా అందించారు.

గనికు డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ పూర్తి స్థాయి నిర్మాతగా మారి చేస్తున్న సినిమా ఇదే. అరవింద్ కూడా సమర్పకులుగా ఉన్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర తారాగణం. భీభత్సమైన ఫామ్ లో ఉన్న తమన్ దీనికీ సంగీతం సమకూరుస్తున్నాడు. మొత్తానికి గనితో అటెన్షన్ తనవైపు తిప్పుకున్న వరుణ్ తేజ్ అంచనాలైతే రేపాడు. వచ్చే వేసవికి విడుదల ప్లాన్ చేసిన గని షూటింగ్ దాదాపు పూర్తయినట్టు సమాచారం