iDreamPost
android-app
ios-app

వై.యస్ వివేకా హత్య కేసు – పులివెందులకి సిట్ బృందం.

  • Published Dec 03, 2019 | 6:45 AM Updated Updated Dec 03, 2019 | 6:45 AM
వై.యస్ వివేకా హత్య కేసు – పులివెందులకి సిట్ బృందం.

తెలుగు రాష్ట్రాలలో సంచలనంసృష్టించిన దివంగత నేత వై.యస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఎన్నో సంచలనాలు , మరెన్నో అనుమానాలకు కేంద్రబిందువుగా మారిన ఈ హత్య వెనక ఎవరు సూత్రదారులు , ఎవరు పాత్రదారులు అనే అంశం ఇప్పటికి స్పష్టత రాలేదు, ఏ1 నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం, హత్య వెనక సునీల్ సుపారీ గ్యాంగ్ ఉంది అనే పుకార్లు రావటం, తెలుగుదేశం కీలక నేతల హస్తం ఉందనే అనుమానాలు మధ్య ఈ కేసు పోలీసులకి సైతం సవాల్ గా మారింది.

తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా పులివెందులకు చేరుకున్న సిట్ అధికారులు తెలుగుదేశంకి చెందిన ఇద్దరు కీలక నేతలతో పాటు, వై.యస్ కుటుంభ సభ్యులైన వై.యస్ భాస్కర్ రెడ్డి, వై.యస్ మనోహర్ రెడ్డిలను కడప నగరంలోని రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి విచారించి వారి నుండి కొంత కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. పులివెందుల ప్రాంతంలో సౌమ్యుడిగా ప్రజల మనిషిగా పేరు సంపాదించిన వివేకాని దారుణంగా హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంది,ఈ హత్య వెనుక ఆర్ధిక లావాదేవీలా లేక రాజకీయ కోణం ఉన్నదా అనే అనుమనాలు ఇప్పటికి పులివెందుల వాసులను వెంటాడుతూనే ఉన్నాయి, ఇటువంటి సమయంలో సిట్ పులివెందుల చేరుకొవటంతో మరోసారి ఆ ప్రాంతంలో ఈ హత్య గురించి చర్చ మొదలైంది.

దారుణ హత్యగావింపబడ్డ వివేక ముఖ్యమంత్రి జగన్ కి సొంత చిన్నాన్న అవ్వటంతో విపక్షాలన్నీ ఏకమై విచారణలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయి ఉండి సొంత చిన్నాన్నను చంపిన హంతకులను పట్టుకోలేకపొయారు అనే మరకను ప్రభుత్వంపై వేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక పక్క సిట్ బృందం మాత్రం ఈ హత్య చేసిన వారిని పట్టుకునేందుకు అన్ని వైపుల నుండి రహస్యంగా విచారణ జరుపుకుంటూ పోతుంది, ఇప్పటికే అనేక కీలక సాక్ష్యాలను సేకరించినట్టు, త్వరలోనే పూర్తి సాక్ష్యాధారాలతో నిందితులని పట్టుకుని చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాం అని అధికారులు చెబుతున్న మాట.