Idream media
Idream media
9 టీవీ స్టూడియోలో చర్చా వేదిక. రాంగోపాల్‌వర్మ, పాల్ ప్రేక్షకుల మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు.
“వర్మగారూ మీకు పిచ్చి అంటారు నిజమేనా?” అడిగాడు యాంకర్ సుజనీకాంత్.
“పిచ్చిలేని వాడు ఎవడుంటాడు? మనముందున్న పాల్‌కి పిచ్చిలేదా” అన్నాడు వర్మ. పాల్‌కి తిక్కరేగింది.
“నేనెవరనుకున్నావ్. ట్రంపు సలహాదారున్ని. మోదీ నన్నడిగే మహారాష్ర్టలో ఫెయిల్ అయ్యాడు. అమిత్‌షా నేనూ ఉదయాన్నే చెస్ ఆడుతాం తెలుసా” అన్నాడు పాల్.
“దీన్నేమంటారు. పిచ్చికాకుండా వేరే పేరుందా?” అన్నాడు వర్మ.
“మీరు కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ఎందుకు తీశారు” అడిగాడు సుజనీ.
“నేను డైరెక్టర్‌ని కాబట్టి” అన్నాడు వర్మ.
“నువ్వు డైరెక్టర్ ఏంటి?”
“నేను 128 దేశాలకి స్పిరిచ్యువల్ డైరెక్టర్‌ని” అన్నాడు పాల్.
“అందుకే నేను నీ మీద సినిమా తీసింది” అన్నాడు వర్మ.
“నిన్ను కోర్టుకి ఈడుస్తా” రెచ్చిపోయాడు పాల్.
“టెన్నిస్ కోర్టుకా, బ్యాడ్మింటన్ కోర్టుకా?” నవ్వాడు వర్మ.
“ఇంతకూ అడిగిందానికి సూటిగా చెప్పండి. బాబుని, లోకేశ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు” అడిగాడు సుజనీ.
“డబ్బులు కావాలి కాబట్టి. బాబుని టార్గెట్ చేస్తే జనం చూస్తారు, పాల్‌ని చూపిస్తే జనం వస్తారు. అందుకే సినిమా తీశా. అయినా మీరెందుకు నన్ను టీవీలో చూపిస్తున్నారు. నన్ను చూపిస్తే రేటింగ్స్ వస్తాయి కాబట్టి” టీ తాగుతూ చెప్పాడు వర్మ.
“డబ్బులు కావాలంటే నేనిస్తా” అన్నాడు పాల్.
“నీ దగ్గరేముంది చిప్ప, మొన్న చూశాను కదా ఎన్నికల్లో” అన్నాడు వర్మ.
“బాబుని టార్గెట్ చేసి , ఈ సినిమాకి చంద్రబాబుకి సంబంధం లేదంటున్నారు. ఇది అబద్ధం కాదా?” అడిగాడు సుజనీ.
“మీ టీవీ వాళ్లు రోజూ నిజమే చెబుతున్నారా? అన్నీ అబద్ధాలే కదా. అయినా బాబు పవర్‌లో ఉన్నప్పుడు మీ మీడియాని ఉపయోగించి ఎంతో మందిని టార్గెట్ చేశాడు. లక్ష్మీపార్వతి, జగన్…ఇంకా చాలా పేర్లు చెబుతా. అప్పుడెందుకు మాట్లాడలేదు” అడిగాడు వర్మ.
“అలా అడుగు వర్మా. ఈ టీవీ వాళ్లే నాకు మెంటల్ అని ప్రచారం చేసింది. ఇప్పుడు నిన్ను కూడా మెంటల్ అంటున్నారు” అన్నాడు పాల్.
“మనిద్దరికీ మెంటల్ అనేది నిజమే కదా” అన్నాడు వర్మ.
“ఇంతకూ మీరు జగన్‌కు అనుకూలమా?” అడిగాడు సుజనీ.
“నేను డబ్బుకి అనుకూలం, పబ్లిసిటీ పిచ్చినాకు. న్యూస్‌లో ఉండకపోతే నాకు తిక్కలేస్తుంది. హారర్, టెర్రరిస్ట్, పొలిటికల్ ఏం సినిమా తీసినా పైసలు, ప్రచారం కోసమే” అన్నాడు వర్మ.
“కరెక్ట్ చెప్పావు వర్మా. కానీ నన్నెందుకు లాగావు దీంట్లోకి” అన్నాడు పాల్.
“నిన్ను ఒకడు లాగడం ఏంటి?. అన్నింటిలోకి నువ్వే దూరుతావుగా” అన్నాడు వర్మ.
“ఇంతకీ కమ్మ సినిమా హిట్టా, ప్లాఫా?” అడిగాడు సుజనీ.
“ఎవడికి తెలుసు. నేను అన్ని సినిమాలు ఒకేలా తీస్తాను. దేన్నీ జనం చూడరు” అన్నాడు వర్మ.
“చూడనప్పుడు ఎందుకు తీయడం?”
“తీస్తేనే కదా గంటసేపు నువ్వు స్టూడియోలో కూర్చోపెడతావ్”
“కరెక్ట్ వర్మా. మనం న్యూస్‌లో ఉండాలంటే పిచ్చి ఉండాలి. టీవీ వాళ్లకి పిచ్చివాళ్లతోనే రేటింగ్స్” అన్నాడు పాల్.
వర్మ, పాల్ కలసిపోయే సరికి
సుజనికి ఏం చేయాలో తెలియక “ఇప్పుడే చిన్న బ్రేక్” అన్నాడు.