iDreamPost
iDreamPost
సర్దార్ పటేల్ స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ లోని మితవాదులకు నాయకుడిగా పార్టీలో ఏర్పడే తగాదాలను పరిష్కరించి ఏకతాటిపై వారిని నడిపే సామర్ధ్యం ఉన్న వ్యక్తిగా, గాంధీజీ నిర్ణయాన్ని పార్టీలో అందరూ తూచా తప్పకుండా పాటించేలా కాంగ్రెస్ శ్రేణులని సంఘటితం చేసే మనిషిగా మహాత్ముడికి కుడిభుజంగా ఎనలేని సేవలు అందిచారు. అలాగే స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యంగ రచనలో ప్రముఖ పాత్ర పోషించటమే కాకుండా వివిధ సంస్థానాలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి ఏక భారత్ గా తీర్చిద్దిన ధీరుడిగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్‌లో జవేరాబాయి పటేల్, లాడ్‌బాయి దంపతులకు 1875 అక్టోబర్ 31న నాలుగవ సంతానంగా జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన 6వ ఏటనే గుజరాతీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించారు. పటేల్‌కు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్ పూర్తయింది. పటేల్ కు న్యాయవాది అవ్వాలని కోరిక ఉన్న ఆర్థిక స్థోమత లేని కారణంగా, పుస్తకాలను స్థానిక న్యాయవాదుల దగ్గర అడిగి తెచ్చుకొని నిర్విరామామంగా 3 సంవత్సరాలు కష్టపడి చదివి ప్లీడర్ పరీక్ష పాసయ్యారు. గోద్రాలో వకీలుగా రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేసి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్లి మిడిల్ టెంపుల్ లో న్యాయవాదిగా చేరారు ఆ తరువాత భారత్ కు తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాది వృత్తిని ప్రారంభించి కొద్దికాలంలోనే క్రిమినల్ లాయర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.
గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగానే మోతీలాల్ నెహ్రూ మాదిరిగానే పటేల్ కూడా తన లా ప్రాక్టీసును వదిలి గాంధీని అనుసరించడం మొదలుపెట్టారు. 1924 నుంచి 1928 వరకు అహ్మదాబాద్ పురపాలక సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ లో రైతులకు మద్దతుగా జరిగిన బార్డోలి ఉద్యమం విజయవంతం అవ్వడంతో వల్లభ్ భాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ లోనూ, జాతీయోద్యమంలోనూ ప్రధాన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో సార్లు జైలు జీవితం గడిపారు. 1932 నుంచి 42 వరకు కాంగ్రెస్ పార్లమెంటరి ఉపసంఘాద్యక్షుడిగా వ్యవహరించారు.
స్వాతంత్య్రం అనంతరం నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించి ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భిన్న మతాలు భిన్న సంస్కృతులుగా ఉన్న 562 సంస్థానాలను ఏకం చేసి భారత్ యూనియన్‌లో విలీనం చేసిన ఘనత ఆయనది. ముఖ్యంగా నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణను ఆపరేషన్ పోలో పేరున సైనిక చర్య చేపట్టి ఆ సంస్థానాన్ని దేశంలో విలీనం అయ్యేలా చేయడం ఆయన దీక్షా దక్షతకు నిదర్శనం గా చెప్పచ్చు.
భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ విశేషమైన సహకారాన్ని అందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశారు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించారు. వయోభారం వలన, అనారోగ్యం వలన పటేల్ తన 75వ ఏట 1950 డిసెంబరు 15వ తేదీన స్వర్గస్తులయ్యారు. గాంధీజీ లెనిన్ అయితే పటేల్ స్టాలిన్ అని ఇప్పటికి అభివర్ణిచేవారు ఉన్నారు. 2014 నుంచి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని “రాష్ట్రీయ ఏక్తా దివస్” గా జరుపుకుంటుంది. ఆయన సేవలకు గుర్తుగా ప్రపంచంలోనే ఎత్తయిన (597 అడుగులు) ఆయన విగ్రహాన్ని గుజరాత్ లోని నర్మదా వ్యాలి దగ్గర భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నేడు ఆ మహనీయుని 145వ జన్మదినం సందర్భంగా..