iDreamPost
android-app
ios-app

మెట్రో రైలులో వకీల్ సాబ్ హల్చల్

  • Published Nov 05, 2020 | 6:19 AM Updated Updated Nov 05, 2020 | 6:19 AM
మెట్రో రైలులో వకీల్ సాబ్ హల్చల్

ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ లో తిరిగి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ జీవితంలో మొదటిసారి మెట్రో ట్రైన్ ప్రయాణం చేశారు. ఇందాకా మాదాపూర్ నుంచి మియాపూర్ దాకా జర్నీ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. టికెటింగ్, చెకింగ్, భద్రతా ప్రమాణాలు అన్నిటి మీదా ఓ లుక్ వేశారు. కూడా నిర్మాత దిల్ రాజుతో పాటు ఇతర టీమ్ సభ్యులు ఉన్నారు. తను వచ్చే విషయం ముందే లీక్ చేయకపోవడంతో అభిమానుల తాకిడి లేకుండా పోయింది. అందులోనూ కరోనా నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అధికారులు ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

మధ్యలో అమీర్ పేట్ స్టేషన్ లో ట్రైన్ మారిన పవన్ అక్కడ కొంత మందితో మాట్లాడారు. ఊహించని స్వీట్ షాక్ కి ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ట్రైన్లో ద్రాక్షారామంకు చెందిన సత్యనారాయణతో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. వర్షాలు, పంటలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మెట్రోలో జర్నీ చేయడం ఇదే మొదటిసారని సదరు రైతు చెప్పగా తనకూ అంతేనని పవన్ చెప్పడం కొసమెరుపు. మియాపూర్ లో జరిగే షూట్ లో పవన్ పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా ఈ రోజు మెట్రో ఎంచుకోవడానికి కారణం మాత్రం చెప్పలేదు కానీ కేవలం ఒక ఎక్స్ పీరియన్స్ కోసమేనని తెలిసింది.

వకీల్ సాబ్ ని 2021 సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారు. అప్పటికంతా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు వస్తే నిర్మాత దిల్ రాజు దీన్ని బరిలో దించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇతర సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసినప్పటికీ పవన్ వస్తే మాత్రం ఒకరో ఇద్దరో సైడ్ తీసుకోకతప్పదు. ఏకధాటిగా జరిపే షెడ్యూల్ లో వకీల్ సాబ్ ని పూర్తి చేయబోతున్నారు. శృతి హాసన్ కూడా జాయిన్ కాబోతోంది. హిందీ పింక్ రీమేక్ ఆధారంగా రూపొందుతున్న వకీల్ సాబ్ లో పవన్ మొదటిసారి న్యాయవాదిగా నటించడం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. నివేదా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం టీజర్ సిద్ధం చేసే పనిలో ఉంది యూనిట్