iDreamPost
android-app
ios-app

మానభంగం మీద గళమెత్తిన ఊర్మిళ – Nostalgia

  • Published Jan 27, 2021 | 12:53 PM Updated Updated Jan 27, 2021 | 12:53 PM
మానభంగం మీద గళమెత్తిన ఊర్మిళ – Nostalgia

యుగాలు గడుస్తున్నా అబలల మీద అఘాయిత్యాలు మాత్రం ఎంత నిత్యకృత్యంగా మారాయో చూస్తూనే ఉన్నాం. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఈ దౌర్జన్య పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. కామాంధుల దుర్మార్గాలకు తుది కనిపించడం లేదు. సున్నితమైన ఈ అంశం మీద సినిమాలు వచ్చిన దాఖలాలు తక్కువే. జనం వీటిని ఎక్కువ ఆదరించరన్న అనుమానం దర్శకులను వెనుకడుగు వేసేలా చేస్తుంది. కొన్ని మినహాయింపుగా నిలిచినవి లేకపోలేదు. అందులో 1993లో వచ్చిన ఊర్మిళ గురించి చెప్పుకోవాలి. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో మాలశ్రీ టైటిల్ రోల్ పోషించగా సుమన్ చాలా కీలకమైన మరో పాత్రలో కనిపిస్తారు. దీని విశేషాలు చూద్దాం.

అదే ఏడాది ఏప్రిల్ నెల బాలీవుడ్ లో దామిని సినిమా వచ్చింది. మీనాక్షి శేషాద్రి-రిషి కపూర్-సన్నీ డియోల్ కాంబినేషన్ లో రాజ్ కుమార్ సంతోషి డైరెక్షన్ లో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా అక్కడ అద్భుత విజయాన్ని సాధించింది. ఓ పెద్ద ధనవంతుల కుటుంబంలో హోలీ పండగ సందర్భంగా తాగిన మైకంలో ఆ ఇంటి కుర్రాళ్ళు పనిమనిషిని దారుణంగా మానభంగం చేస్తారు. అప్పుడే కొత్త కోడలిగా అక్కడ అడుగు పెట్టిన దామిని ఆమె కోసం అయినవాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ కారణంగా అందరూ వెలేసి పిచ్చిదానిగా ముద్రవేసిన సమయంలో ఆమెకు అండగా నిలబడతాడు లాయర్ గోవింద్. ఆ తర్వాత ఉంటుంది అసలైన డ్రామా.

దీన్ని తెలుగులో రీమేక్ చేద్దామనే ఉద్దేశంతో భరద్వాజ్ హక్కులు కొని ఊర్మిళను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఒరిజినల్ వెర్షన్ లో విలన్ గా నటించిన అమ్రిష్ పూరి పాత్రను ఇక్కడ కోట శ్రీనివాసరావు చేయగా దాని విజయంలో కీలక పాత్ర పోషించిన సన్నీ డియోల్ స్థానంలో సుమన్ వచ్చారు. చిన్న క్యామియో సౌందర్య చేసింది. విద్యాసాగర్ సంగీతం అందించారు. శ్రీకాంత్ ఓ పాటలో గెస్ట్ గా చేశారు. హిందీలో దీన్ని అమీర్ ఖాన్ తో వేయించారు. మాలాశ్రీ భర్తగా ఆమె నిజ జీవిత ప్రియుడు సునీల్ నటించాడు. తర్వాత ఓ యాక్సిడెంట్ లో ఈయన కన్నుమూయడం విషాదం. 1993 డిసెంబర్ 30న ఊర్మిళ విడుదలయ్యింది. కానీ హిందీ స్థాయిలో స్పందన దక్కించుకోలేదు. క్యాస్టింగ్ విషయంలో జరిగిన పొరపాట్లు కూడా దీనికో కారణంగా చెప్పుకోవచ్చు.