iDreamPost
iDreamPost
బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలన వసూళ్లు నమోదు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ఉప్పెన మూడో వారం కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. దీని తర్వాత వచ్చినవి ఒక్కొక్కటిగా టికెట్ కౌంటర్ల దగ్గర టపా కట్టేయడం బాగా కలిసి వస్తోంది. ఫిబ్రవరి నెలలో విడుదలై అత్యధిక కలెక్షన్లు తెచ్చుకున్న సినిమాల్లో మిర్చిని దాటి మరీ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇంకా ఫైనల్ రన్ కి టైం ఉంది కాబట్టి ఫిగర్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయో ఊహించడం ఇప్పటికిప్పుడు కష్టమే. మరోవైపు మైత్రి వాళ్ళు ప్రమోషన్ ఆపడం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను గుళ్ళు గోపురాలు థియేటర్లు తిప్పుతూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగేలా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఉప్పెన కథ తాలూకు ఐడియా ఒరిజినల్ కాదనే టాపిక్ ఇప్పుడు తెరమీదకు వస్తోంది. నిజానికి ఈ పాయింట్ తో తెలుగులో సినిమా రాలేదన్నది వాస్తవం. అయితే 2017లో ‘మడ్ బౌండ్’ అనే అమెరికన్ మూవీ వచ్చింది. హిల్లరీ జార్దాన్ అనే మహిళా రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఇది రూపొందింది. దీనికి చాలా అవార్డులు వచ్చాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం మిసిసిపి ప్రాంతంలో తెలుపు నలుపు జాతీయుల మధ అంతర్యుద్ధం నేపధ్యంగా తీసుకుని ఈ ప్రేమకథను రూపొందించారు. కాకపోతే ఇందులో బ్లాక్ హీరోకి వైట్ హీరోయిన్ కి కొడుకు పుడతాడు. ఇది తెలిసి అమ్మాయి తండ్రి హీరో మగతనాన్ని తొలగిస్తాడు. మిగిలినది సినిమాలో చూడాలి.
అర్థమయ్యింది కదా. మెయిన్ పాయింట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తేడా అంతా ఉప్పెనలో ఇద్దరూ ఒక రాత్రి గడుపుతారు కానీ సంతానం కలిగినట్టు కానీ ఆ సూచనలు ఉన్నట్టు కానీ చూపించరు అంతే. ఎప్పుడో వచ్చిన జమానా సినిమా అయితే ఏదో యాదృచ్చికం అనుకోవచ్చు కానీ ఇలా ఇంత క్లియర్ గా సారూప్యత కనిపిస్తుంటే మాత్రం ఎవరైనా అనుమాన పడకుండా ఉండగలరా. సదరు మడ్ బౌండ్ మన థియేటర్లకు రాలేదు కాబట్టి అవగాహన లేదు కానీ అన్ని బాషల సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులు మాత్రం గుర్తుపట్టేశారు. ఇప్పుడీ విషయం కూడా గుఱ్ఱం సీతారాములు అనే విశ్లేషకులు బయటికి తీసుకురావడంతో వెలుగులోకి వచ్చింది.