iDreamPost
iDreamPost
ఢిల్లీ పీఠానికి దారి చూపించే ఉత్తరప్రదేశ్ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ ఎన్నికల్లో సత్తా చూపి అధికారం అందుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మూడు నెలల క్రితం నుంచి సన్నాహాలు ప్రారంభించాయి. పొత్తుల కసరత్తులు, అభ్యర్థుల గుర్తింపు, ప్రచారాస్త్రాలకు పదును పెట్టడం, ప్రజలను ఆకట్టుకునే ఎత్తులతో రాష్ట్రాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు మించి చిన్నా చితకా పార్టీల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో ఎక్కువ సీట్లున్న యూపీలో.. అందుకు తగినట్లే ఎన్నికల బరిలో సవాల్ చేసే పార్టీలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో సింహాభాగం చిన్నా చితకా పార్టీలే. వ్యక్తులు, వర్గాల ప్రాబల్యంపై ఆధారపడిన ఈ పార్టీలు ప్రధాన పార్టీల అవకాశాలకు గండి కొడుతుంటాయి.
Also Read:కొడాలి నానికి ధీటైన నాయకుడే దొరకడం లేదా?
అందుకే వీటిని మచ్చిక చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. ఆ మేరకు ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ పొత్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ దారుల్లో ఒకటైన బహుజన సమాజ్ పార్టీ తప్ప మిగిలిన సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెసులు చిన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళతామని ప్రకటించాయి. దీన్ని బట్టే చిన్న పార్టీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
వాటికి ప్రాధాన్యత ఎందుకు?
కొన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలు, సామాజికవర్గాల ఆధారంగా యూపీలో వందలాది పార్టీలు పనిచేస్తున్నాయి. కులాల ప్రాతిపదికన ఇవి ఓట్లను చీల్చివేసి ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయి. 2012 ఎన్నికల్లో 200కు పైగా పార్టీలో బరిలో నిలిచాయి. 2017 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 290కి పెరిగింది. వీటిలో 32 పార్టీలు 5వేల నుంచి 50 వేల వరకు ఓట్లు సాధించాయి. ఆరు పార్టీలు 50వేలకు పైగా ఓట్లు సాధించగా మరో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి.
Also Read : కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన కొండా సురేఖ
కాగా గత ఎన్నికల్లో కనీసం 56 నియోజకవర్గాల్లో పెద్ద పార్టీల విజయావకాశాలను చిన్న పార్టీలు దెబ్బ తీశాయి. పెద్దగా ప్రాముఖ్యత లేని పార్టీలకు చెందిన 8 మంది అభ్యర్థులు గత ఎన్నికల్లో వెయ్యిలోపు ఓట్ల మెజారిటీతో గెలవడం విశేషం. కాస్తో కూస్తో పేరున్న అప్నాదళ్(ఎస్) తాను పోటీచేసిన 11 స్థానాల్లో కలిపి 39.21 శాతం ఓట్లు సాధించింది. సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 34.14 శాతం ఓట్లు సాధించింది. ఇంతగా ఓట్లు కొల్లగొడుతున్న చిన్న పార్టీల వల్ల ఓట్ల చీలికను అడ్డుకొని, విజయావకాశాలను పెంచుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే తాపత్రయ పడుతున్నాయి.
ప్రధాన పార్టీలు.. వాటి తోకలు
యూపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీయూ, ఆర్పీఐ, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తోంది. గణనీయమైన మత్స్యకార ఓటు బ్యాంకు ఉన్న నిషాద్ పార్టీకి ఆరు పార్లమెంటు స్థానాల పరిధిలో పట్టుంది. అప్నాదళ్ (ఎస్), ఎస్బీఎస్పీ పార్టీలకు ఓబీసీ కి చెందిన కుర్మీ వర్గంలో పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసి 2019 ఎన్నికల ముందు విడిపోయిన ఎస్బీఎస్పీ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజభర్ ఇటీవల పది చిన్న పార్టీలతో కలిసి భాగదారీ సంకల్ప మోర్చా ఏర్పాటు చేశారు. ఈ కూటమిలోనే ఎంఐఎం భాగస్వామిగా ఉంది. బీజేపీ తప్ప ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఈ కూటమి ప్రకటించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ.. ఆర్ఎల్డీ, మహాన్ దళ్, జనవాడీ సోషలిస్ట్ పార్టీ, ఇతర మరికొన్ని పార్టీలతో చర్చలు జరుపుతోంది.
Also Read : అక్కడ విలవిల .. ఇక్కడ కళకళ .. ఇంతలో ఎంత మార్పు..?