ఓ డివిజన్కు కార్పొరేటర్ అయితే చాలు. ఎలాగోలా బరిలో నిలిచాం. దాని కోసం పోరాడి డివిజన్ లో అందరి చేత మంచి అనిపించుకొని ఓట్లు వేయించుకుంటే ఛాలు అంతకన్నా ఆనందం లేదు అనుకున్న ఆమె ఇంటికి ప్రోటోకాల్ పదవి నడిచి వచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసిన వైసీపీ ఎవరూ ఊహించని రీతిలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ నుంచి ఎం. డి. కరీమున్నిసానూ జగన్ ఎంపిక చేశారు. దీంతో కలలో కూడా అనుకోని పదవి అంటూ ఆమె ఆనంద భాష్పాలు రాల్చారు.
కార్పొరేటర్ అభ్యర్థి గా ప్రచారం!
మున్సిపల్ ఎన్నికల జోరు మీద ఉన్న సమయంలో విజయవాడ కార్పొరేషన్ చివరి డివిజన్ అయిన 59 వ డివిజన్ కు వైకాపా అభ్యర్థిగా ఎండి కరీమున్నిసా బరిలో ఉన్నారు. గురువారం సాయంత్రం వరకూ ఆమె ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు చదువుతున్న సమయంలోనే కరి మున్నీసాకు తన పేరు అని తెలియదు. సాయంత్రం ఆమె ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు వరుసగా ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో ఇది కలా నిజమా అంటూ నమ్మలేకపోవడం ఆమె వంతు అయ్యింది.
వైయస్సార్ కు వీర అభిమాని!
అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు ప్రాంతానికి చెందిన కరి మున్నీసా వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆమె మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. వైయస్ జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా ముందుండేవారు. ముఖ్యంగా విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి ఆమె పని చేశారు.
2014లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 54 వ డివిజన్ నుంచి వైకాపా తరపున కార్పొరేటర్గా పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. అయితే తర్వాత వార్డుల పునర్విభజన లో 54 వ డివిజన్ 59 గా మారడంతో ప్రస్తుతం ఆ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె కుటుంబ నేపథ్యం పార్టీకు అంకితభావంతో పనిచేసే తత్వం గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకు మైనారిటీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. కరి మున్నీసా చివరి కొడుకు రుహుళ్ల ప్రస్తుతం వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కీలక నేతల సహకారం!
కరి మున్నీసాకు కీలకమైన ఎమ్మెల్సీ పదవి రావడానికి వైకాపా కీలక నేతలు సహకారం అందించారు. ముఖ్యంగా విజయవాడ మధ్య నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే పూనూరు గౌతమ్ రెడ్డి ఆమెకు పదవి రావడంలో కీలకమయ్యరు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో భాగమైన సింగ్ నగర్లో మైనార్టీ వర్గానికి చెందిన మహిళా నేతను తెర పైకి తీసుకు వస్తే విజయవాడలో ఎంతో ప్లస్ అవుతుంది అని భావించే అది మున్నీసా పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. దీంతోపాటు నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మంత్రి వెల్లంపల్లి సైతం ఆమెకు తమ మద్దతును తెలియజేసి పదవి వచ్చేందుకు వారి వంతు సహకారం అందించారు.